- అధికారులకు మంత్రి సీతక్క సూచన
ఆదిలాబాద్, జూలై 1(విజయక్రాంతి): నిబంధనలకు విరుద్ధంగా అధికారులు పనిచేయొద్దని, విధి నిరహణలో అంకిత భావంతో ఉండాలని రాష్ర్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సూచించారు. జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. అధికారులు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అంతకుముందు ఆదిలాబాద్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఉట్నూర్ మండలంలోని రామలింగంపల్లి గ్రామం నుండి శ్యామ్ నాయక్ తండా వరకు తారు రోడ్డు, బ్రిడ్జి నిర్మాణానికి కలెక్టర్ రాజరిషా, ఎస్పీ గౌస్ ఆలం, ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఇంద్రవెల్లిలో అమరవీరుల స్థూపాన్ని దరించుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విధంగా రూ.కోటితో అమరవీరుల స్మృతివన నిర్మాణ పనులు ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని మావల హరితవనం పార్కులో వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. పోలీస్ శాఖ ఆధర్యంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌ను మంత్రి సీతక్క ప్రారంభించారు.