28-12-2025 02:25:34 PM
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, ఆమె ఢాకాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వైద్యులు తెలిపారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పి)కి మాజీ ప్రధాని ఖలీదా జియా (80) పలు ఆరోగ్య సమస్యలతో నవంబర్ 23 నుండి రాజధాని నగరంలోని ఎవర్కేర్ ఆసుపత్రిలో చేరారు. డిసెంబర్ 11న వైద్య సిబ్బంది జియా ఊపిరితిత్తులపై ఒత్తిడిని తగ్గించడానికి, ఇతర ముఖ్యమైన అవయవాలు కోలుకోవడానికి వెంటిలేటర్ పై ఉంచారు.
ప్రస్తుతం ఖలీదా జియా పరిస్థితి మెరుగుపడిందని చెప్పలేమని, ఆమె అత్యంత క్లిష్టమైన దశలో ఉన్నారని డాక్టర్ ఏజెడ్ఎం జాహిద్ పేర్కొన్నారు. అల్లా దయవల్ల ఆమె ఈ క్లిష్టమైన కాలాన్ని దాటగలిగితే, మనం ఏదైనా సానుకూల వార్త వినవచ్చని, జియా త్వరగా కోలుకోవాలని దేశ ప్రజలు ప్రార్థించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఖలీదా జియా కుమారుడు, బీఎన్‌పీ తాత్కాలిక చైర్‌పర్సన్ తారిక్ రెహమాన్ ఆసుపత్రిలో రెండు గంటలకు పైగా గడిపి, అర్ధరాత్రికి కొద్దిసేపటి ముందు అక్కడి నుండి వెళ్లిపోయారని పార్టీ సభ్యులు తెలిపారు.
జియాకు అందించే చికిత్సలో స్థానిక, విదేశీ వైద్యులతో పాటు ఆమె కోడలు డాక్టర్ జుబైదా రెహమాన్ కూడా చికిత్సా ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఆమెను మెరుగైన వైద్య చికిత్స కోసం విదేశాలకు తీసుకెళ్లాలని తాము కోరుకుంటున్నట్లు బీఎన్‌పీ గతంలో సూచించింది. అయితే, ఆమె ప్రస్తుత శారీరక పరిస్థితి విమాన ప్రయాణానికి అనుకూలంగా లేదని, దేశంలోనే చికిత్స కొనసాగుతోంది.