ఓటరు జాబితా సవరణలో పొరపాట్లకు తావివ్వొద్దు
కలెక్టర్ అంకిత్
ములకలపల్లి, జూన్ 29, (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం ములకలపల్లి మండలంలో పర్యటించి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంతో పాటు ములకలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదట ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్ ఫారాలు పంపిణీ చేస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ప్రతి ఓటరికి ఫారాలు అందేలా చర్యలు తీసుకోవాలని బీఎల్వోలకు సూచించారు. అనంతరం దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ములకలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, మౌలికసదుపాయాలు, పరిశుభ్రత, రోగులకు అందిస్తున్న చికిత్స విధానాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట తహసీల్దార్ స్వాతి బిందు, డిప్యూటీ తహసీల్దార్ భాగ్యలక్ష్మి, వైద్యాధికారి డాక్టర్ సాయి కళ్యాణ్, హెల్త్ సూపర్వైజర్ శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.






