20 August, 2026 | 5:57 AM

ఆహార భద్రత చట్టం అమలులో నిర్లక్ష్యం వద్దు

20-08-2026 12:00 AM

నాగర్ కర్నూల్, ఆగస్టు 19 ( విజయక్రాంతి): అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆహార భద్రత, పోషకాహారం, మాతృత్వ ప్రయోజనాలు సకాలంలో అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి సూచించారు. బుధవారం కల్వకుర్తి మండలంలో రేషన్ దుకాణం, ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలు, గురుకుల పాఠశాలలను కమిషన్ సభ్యులతో కలిసి ఆయన తనిఖీ చేశారు. రేషన్ సరుకుల పంపిణీ, మధ్యాహ్న భోజనం, అంగన్వాడీల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న పోషకాహారాన్ని పరిశీలించారు.

నాసిరకం గుడ్లు అందుతున్నట్లు గుర్తించిన ఆయన నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం, అవకతవకలకు తావులేకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఫుడ్ కమిషన్ సూచనలను పరిగణనలోకి తీసుకుని విద్యార్థులు, చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు చర్యలు చేపడతామని కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.