డ్రగ్స్, మద్యానికి బానిసలు కావొద్దు
యువత భవిష్యత్తును కాపాడుకోవాలి: -సీఐ మల్లికార్జున రెడ్డి
మొయినాబాద్ జూలై 12 (విజయక్రాంతి): యువత డ్రగ్స్, మద్యానికి బానిసలై తమ జీవితాలను, కుటుంబాలను ఇబ్బందుల్లోకి నెట్టుకోవద్దని మొయినాబాద్ సీఐ వై. మల్లికార్జున రెడ్డి సూచించారు. నేటి యువతే దేశ భవిష్యత్తని, తాత్కాలిక ఆనందం కోసం మాదకద్రవ్యాలు, మద్యానికి అలవాటు పడితే బంగారు భవిష్యత్తు అంధకారమవుతుందని అన్నారు. డ్రగ్స్, మద్యం అలవాట్ల వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు కుటుంబ, ఆర్థిక, సామాజిక ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు.
మాదకద్రవ్యాలకు బానిసైన యువత నేరాల బాట పట్టే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, అందువల్ల ప్రతి ఒక్కరూ వాటికి దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు, యువత తమ సమయాన్ని చదువు, క్రీడలు, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి వంటి సృజనాత్మక కార్యక్రమాలకు కేటాయించాలని కోరారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై ఎప్పటికప్పుడు దృష్టి ఉంచాలని, అనుమానాస్పద కార్యకలాపాలు లేదా మాదకద్రవ్యాల విక్రయాల గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని, యువత తమ బంగారు భవిష్యత్తును కాపాడుకుంటూ సమాజాభివృద్ధికి తోడ్పడాలని సీఐ వై. మల్లికార్జున రెడ్డి పిలుపునిచ్చారు.






