ఆ మహిళలకు ప్రసూతి సెలవును నిరాకరించొద్దు
అది రాజ్యాంగ విరుద్ధం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, మార్చి 17: దత్తత తీసుకున్న బిడ్డ వయస్సుతో సంబంధం లేకుండా, దత్తత తీసుకున్న తల్లికి వేతనంతో కూడిన 12 వారాల ప్రసూతి సెలవుకు అర్హత ఉండాలని సుప్రీంకోర్టు ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు ఇచ్చింది.మూడు నెలల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలను దత్తత తీసుకునే మహిళలకు ప్రసూతి సెలవును నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది.
దత్తత తీసుకున్న తల్లిదండ్రులకు, బిడ్డకు గౌరవప్రదమైన జీవితం గడిపే హక్కు ఉందని కూడా కోర్టు గుర్తించింది. దత్తత తీసుకున్న బిడ్డ వయస్సుతో సంబంధం లేకుండా, దత్తత తీసుకున్న తల్లికి 12 వారాల ప్రసూతి సెలవుకు అర్హత ఉండాలని జస్టిస్ పర్దివాలా, జస్టిస్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.‘తల్లి జీవితంలోకి బిడ్డ ఏ విధంగా వస్తుందనే దానిని బట్టి మాతృత్వ రక్షణ ఉద్దేశ్యం మారదు. మూడు నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న బిడ్డను దత్తత తీసుకునే మహిళలతో, పెద్ద వయస్సు ఉన్న బిడ్డను దత్తత తీసుకునే మహిళల పరిస్థితి కూడా సమానమే,’‘ అని సుప్రీంకోర్టు పేర్కొంది.




