18 March, 2026 | 3:01 AM

సెలవు ఇవ్వలేదని బ్యాంక్ మేనేజర్ హత్య

18-03-2026 01:37 AM

సెక్యూరిటీ గార్డు కాల్పులు గాజియాబాద్‌లో ఘోరం!

లక్నో, మార్చి 17: ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. సెలవుల విషయంలో ఏర్పడిన వివాదం చినికి చినికి గాలివానలా మారి, ఒక సెక్యూరిటీ గార్డు తన పై అధికారి అయిన బ్యాంక్ మేనేజర్ను కాల్చి చంపిన ఉదంతం కలకలం రేపుతోంది.గాజియాబాద్లోని పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ లో రవీంద్ర హుడా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి బ్యాంక్ మేనేజర్ అభిషేక్ కుమార్ (34) తన క్యాబిన్‌లో ఉండగా, రవీంద్ర లోపలికి వెళ్లి తన వద్దనున్న తుపాకీతో కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన అభిషేక్‌ను సిబ్బంది ఆసుపత్రికి తరలించేలోపే ఆయన మృతి చెందారు.

నిందితుడు రవీంద్ర పోలీసుల విచారణలో తన నేరాన్ని అంగీకరిస్తూ పలు విషయాలు వెల్లడించాడు.తాను సెలవు అడిగినప్పుడల్లా మేనేజర్ నిరాకరించేవారని, దీనివల్ల ఇరువురి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని తెలిపాడు. సెలవు తీసుకున్న ప్రతిసారీ జీతంలో డబ్బులు కట్ చేస్తున్నారన్న కోపంతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు చెప్పాడు. నిందితుడు రవీంద్ర హుడా మాజీ ఆర్మీ ఉద్యోగి.

2018లో పదవీ విరమణ పొందిన తర్వాత బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా చేరాడు. రవీంద్రతో పాటు అతడికి సహకరించిన శిశుపాల్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.మరణించిన బ్యాంక్ మేనేజర్ అభిషేక్ కుమార్ స్వస్థలం పాట్నా (బీహార్). గతేడాది మాత్రమే ఆయన గాజియాబాద్‌కు బదిలీపై వచ్చారు. చిన్న వయసులోనే విధి నిర్వహణలో ఉండగా ఇలాంటి దారుణానికి గురికావడం పట్ల తోటి ఉద్యోగులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.