అమేథీని వదిలేదే లే!
రాయ్‌బరేలీ, అమేథీ మా కర్మభూములు
దశాబ్దాల నుంచి వాటితో మాకు అనుబంధం
అలాగని భావోద్వేగాలతో ఓట్లు అడుగము
చేసిన అభివృద్ధి చూపించి అడుగుతాం
బీజేపీ ట్రాప్‌లో ఎప్పటికీ పడేది లేదు
న్యూఢిల్లీ, మే 18: ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాలతో తమ కుటుంబానికి ఎంతో భావోద్వేగ బంధం ఉన్నదని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక వాధ్రా అన్నారు. ఓటమి భయంతోనే రాహుల్‌గాంధీ అమేథీ నుంచి రాయ్‌బరేలీకి మారాడన్న బీజేపీ విమర్శలను ఆమె తిప్పికొట్టారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తాము ఓట్లకోసం రాజకీయాలు చేయబోమని స్పష్టం చేశారు. రాహుల్‌గాంధీ అమేథీ నుంచి రాయ్‌బరేలీకి మారటం పెద్ద ప్రాధాన్యతాంశం కాదని అన్నారు.
ఈ విషయంలో తాము బీజేపీలో ట్రాప్‌లో పడబోమని తేల్చి చెప్పారు. ‘బీజేపీ వ్యూహంలో మేం పడం. రాహుల్‌గాంధీ అమేథీ నుంచి రాయ్‌బరేలీకి మారటానికి ఎద్ద కారణం అవసరమా? దశాబ్దాలుగా రాయ్‌బరేలీ ఆయన తల్లి ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గం. ఆ సెగ్మెంట్ కోసం ఆమె 40 ఏండ్లు కష్టపడ్డారు. అయినా, మేం అమేథీనేమీ వదిలి పెట్టలేదు. అక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కిషోరీలాల్ శర్మ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గాలతో మా అనుబంధాలు భిన్నమైనవి. ఈ ప్రాంతాలతో మాది కేవలం భావోద్వేగ బంధమని బీజేపీ దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నది.
సుదీర్ఘకాలం ప్రాతినధ్యం వహించినా అభివృద్ధి చేయలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నది. ఈ నియోజకవర్గాలతో మాకు బలమైన భావోద్వేగ అను బంధం ఉన్నమాట నిజమే. ఈ విషయం మా కుటుంబంతోపాటు ఇక్కడి ప్రజలకు కూడా తెలుసు. అయితే, ఆ భావోద్వేగాలపై ఆధారపడి మేం ఓట్లు అడగటంలేదు. మేం చేసిన అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని కోరుతున్నాం. రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ అమేథీ కోసం ఎంతో చేశారు. వాళ్లు చేసినంతగా ఎవరూ చేయలేదని నేను బలంగా చెప్పగలను. మేం ఏంచేశామో అమేథీ ప్రజలకు తెలుసు. గత ఐదేండ్లలో ఏం జరిగిందో కూడా వారికి తెలుసు’ అని ఏర్కొన్నారు.
నేను ఎందుకు పోటీ చేయట్లేదంటే
పార్టీకోసం దేశవ్యాప్తంగా ప్రచారం చేసేందుకే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నట్టు తెలిపారు. ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్‌తో ఆమె మాట్లాడుతూ.. రాహుల్ గాంధీతోపాటు తాను కూడా ఎన్నికల్ల పోటీచేస్తే అది బీజేపీకే లాభిస్తుందని అన్నారు. ‘రాయ్‌బరేలీలో నేను గత 15 రోజులుగా ప్రచారం నిర్వహిస్తున్నాను. రాయ్‌బరేలీతో గాంధీ కుటుంబానికి సుదీర్ఘ అనుబంధం ఉన్నది.
అందువల్ల ప్రజలు మేము ఇక్కడికి రావాలని, వారితో కలవాలని, మాట్లాడాలని కోరుకుంటారు. రిమోట్‌కంట్రోల్‌తో ఇక్కడ ఎన్నికల్లో గెలువలేం. అన్నయ్య, నేను ఎన్నికల్లో పోటీచేస్తే.. సొంత నియోజకవర్గాల్లో కనీసం 15 రోజులైన ఉండి ప్రజలతో మమేకం కావాల్సి ఉంటుంది. కానీ, మాలో ఒక్కరైనా దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని భావించాం. మేమిద్దరం పోటీ చేస్తే బీజేపీకి లాభం జరిగేది’ అని పేర్కొన్నారు.






