ఎలాంటి వివాదం లేదు
రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వంపై ఖర్గే వ్యాఖ్యలు
సమష్టిగా నిర్ణయం ఉంటుందని వెల్లడి
నిరంకుశ పాలనను గద్దె దించడమే మా లక్ష్యం
ఎవరు మాకు మద్దతిచ్చినా స్వాగతిస్తాం
న్యూఢిల్లీ, మే 18: ఇండియా కూటమి తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరనే అంశంపై ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అయితే తొలిసారిగా కూటమి ప్రధాని అభ్యర్థిపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పం దించారు. శనివారం ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిత్వంపై ఎలాంటి వివాదం లేదని స్పష్టం చేశారు. ‘సరైన సంఖ్యా బలం వచ్చిన తర్వాత ప్రధాని ఎవరనే దానిపై నిర్ణయం తీసుకుంటాం. రాహుల్ గాంధీ అభ్యర్థిత్వంపై ఎలాంటి వివాదం లేదు. ఇండియా కూటమి నేతలంతా కూర్చుని నిర్ణయం తీసుకుంటాం’ అని ఖర్గే వ్యాఖ్యానించారు.
ఎవరు మద్దతిచ్చినా ఓకే
ఇండియా కూటమికి టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బయటి నుంచి మద్దతు ఇస్తానన్న వ్యాఖ్యలపై ఖర్గే స్పందించారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో నడుస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా గట్టి ఐకమత్యం అవసరమని ఖర్గే అన్నారు. ‘దేశంలో ప్రస్తుతం ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో బీజేపీ ప్రభుత్వం నడుస్తోంది. అలాంటి వ్యక్తులను గద్దె దించడానికి ఎవరు సాయం చేసినా అందుకు మేం అంగీకరిస్తాం’ అని పేర్కొన్నారు. ‘దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలను అణగదొక్కే వారిని, మతాన్ని దుర్వినియోగం చేసుకునే వారిని గద్దె దించాల్సిన అవసరం ఉంది. బీఎస్పీ చీఫ్ మాయావతి సహా ఎవరైనా సరే మద్దతు ఇస్తామంటే సంతోషంగా స్వీకరిస్తాం’ అని ఖర్గే వివరించారు.
మోదీది నియంతృత్వ పాలన
ప్రధాని మోదీ దేశంలో నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని ఖర్గే దుయ్యబట్టారు. ‘స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలకు మోదీకి నచ్చిన వారిని ఎవరినీ సంప్రదించకుండా, క్యాబినెట్‌లో కనీసం చర్చించకుండా నియమిస్తుంటారు. అదే మేం.. సీబీఐ, సీబీసీ, వైస్ చాన్స్‌లర్లను ప్రతిభ ఆధారంగానే నియమిస్తాం’ అని ఖర్గే అన్నారు.
ప్రజలను భయపెట్టాలనే
ప్రధాని మోదీ దేశ ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. అయోధ్య గుడిపైకి కాంగ్రెస్ బుల్డోజర్లు పంపుతారంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు సున్నిత మనసు ఉన్న వారెవరూ చేయరని, ఆయన మాటలు పనికిమాలినవని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఆయన మాటలు చూస్తుంటే ఓ విజన్ లేకుండా, ప్రజలను తప్పుదోవ పట్టించాలని, భయపెట్టాలని చేస్తున్నట్టుగా ఉంది. బుల్డోజర్ ప్రభుత్వం వారిదే’ అని ఖర్గే అన్నారు.






