7 August, 2026 | 7:50 AM

మోదీవి విద్వేష రాజకీయాలు

19-05-2024 01:47 AM

ఎన్నికల సభలో రాహుల్ గాంధీ విమర్శలు

న్యూఢిల్లీ, మే 18: ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు ఎక్కుపెట్టారు. మోదీవి విద్వేషపూరిత రాజకీయాలు అని, అలాంటి విద్వేష రాజకీయాలు తమకొద్దని పేర్కొన్నారు. శనివారం న్యూఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ‘సీబీఐ, ఈడీ, ఆదాయపన్ను శాఖ వాళ్లు నన్ను 55 గంటల పాటు విచారించి అలసిపోయారు. మా ఇంటిని లాక్కున్నారు. కానీ దేశంలో, చాందినీ చౌక్‌లో వేలాది ఇళ్లు ఉన్నాయి.

ప్రజల గుండెల్లో నాకు ఇల్లు ఉంది. విద్వేష వీధుల్లో  ప్రేమ పూర్వక దుకాణం తెరిచాను’ అంటూ రాహుల్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్‌ను, హేమంత్ సోరేన్‌ను అరెస్టు చేశారని, వారి దగ్గర పెద్ద జాబితా ఉందని, అలాంటి పిరికివాళ్లు మనకు అవసరమా అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకే తాము ఆప్‌తో జతకట్టామని తెలిపారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అంబానీ, అదానీలు మోదీకి కోట్ల రూపాయలు ఇచ్చారని, అయితే వారు కాంగ్రెస్‌కు డబ్బుల టెంపోలు పంపారన్న ఆరోపణలపై ఈడీ దాడులు చేయాలని అడిగితే మౌనంగా ఉన్నారంటూ దుయ్యబట్టారు.