7 April, 2026 | 2:19 AM

రోగులకు అత్యవసర సేవలు ఆపవద్దు

07-04-2026 12:23 AM

వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి

వనపర్తి, ఏప్రిల్ 6 ( విజయక్రాంతి ) : జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ అప్రూవల్ రాలేదనే పేరుతో రోగులకు అత్యవసర సేవలు ఆపవద్దని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి స్థానిక శాసన సభ్యులు తూడి మేఘారెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ఎం సి హెచ్ ఆసుపత్రుల్లో ప్రస్తుతం అందిస్తున్న సేవల గురించి వివరించారు. అనంతరం ఎమ్మెల్యే గత ఏడాది కాలంలో ఆయా ఆసుపత్రుల్లో నమోదైన ఒపీడీ, ఐపీడి, రెఫర్ కేసుల వివరాలను ఆరా తీశారు. దీనిపై సూపరిండెంట్ స్పందిస్తూ జనవరి 2025 నుంచి డిసెంబర్ 2025 వరకు మొత్తం 3.65 లక్షల ఒపీడీ నమోదు కాగా, 33 వేల ఐపీడి నమోదైనట్లు తెలిపారు.

నెలకి సగటున 90 నుంచి 150 కేసులను మహబూబ్నగర్ కు రిఫర్ చేస్తున్నట్లు తెలిపారు. హై రిస్క్ ఉన్న కేసులను సిస్టం లో ఎంట్రీ చేసిన తర్వాత సమాచారం అందించి రిఫర్ చేయాల్సి వస్తుందని తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో ఐసీయూ ఏర్పాటు చేయడానికి ఏమేం సౌకర్యాలు ఉండాలని ప్రశ్నించారు. ఆయా సౌకర్యాలకు సంబంధించి వైద్యశాఖ అధికారులు నివేదిక అందించి ఐసీయూ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ అప్రూవల్ రాలేదనే పేరుతో రోగులకు అత్యవసర సేవలు ఆపవద్దని సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు కావాల్సిన కనీస మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశించారు. జిజిహెచ్, ఎం సి హెచ్ లలో కనీస మౌలిక వసతులకు సంబంధించి ఏమైనా అవసరాలు ఉంటే వెంటనే పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మల్లికార్జున్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపర్డెంట్ అరుణ కుమారి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాయినాథ్ రెడ్డి, ఆర్‌ఎంవో రెడ్డి కుమారి, ఐఎంఏ ప్రెసిడెంట్, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.