7 April, 2026 | 2:19 AM

మనతో పాటు భవిష్యత్ బాగుండాలన్నదే మా సంకల్పం

07-04-2026 12:22 AM

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్, ఏప్రిల్ 6 (విజయ క్రాంతి): మనం బాగుండడమే కాదు మన బిడ్డల భవిష్యత్తు మరింత బాగుండాలని సంకల్పంతోనే నూతన ప్రణాళికలను ఆవిష్కృతం చేస్తూ అడుగులు వేస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం నగరంలోని పలు డివిజన్లలో ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులు యూఐడిఎఫ్ నిధులతో అమలు చేయబడుతున్నాయని చెప్పారు. నగరంలో మొత్తం 14 ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించడం జరుగుతుందని వీటిలో 4 ట్యాంకులకు శంకుస్థాపన చేసినట్లు స్పష్టం చేశారు.

మహానగరంగా మహబూబ్ నగర్ ఆవిష్కృతం కాబోతుందని, వేసవి కాలంలో నీటి కొరత తీవ్రంగా మారుతున్న పరిస్థితుల్లో, శాశ్వత మరియు సమర్థవంతమైన నీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. మొత్తం 200 ఇరవై కోట్ల నిధులతో ఈ ట్యాంకుల నిర్మాణం ప్రజలకు మంచినీరు కల్పించాలని సంకల్పంతో చేస్తున్నామని తెలియజేశారు. ఎట్టి పరిస్థితుల్లో మాయమాటలు ప్రజలకు చెప్పమని ప్రతి ఒక్కరు మెచ్చేలా నచ్చేలా పనులు చేస్తామని తెలియజేశారు. ఎవరో ఎన్ని ఆరోపణలు చేస్తారని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదని విమర్శించారు.

అనంతరం జిల్లా జనరల్ ప్రధాన ఆసుపత్రి నందు ఎమ్మెల్యే సొంత నిధుల నుంచి బాలింతలకు ఎమ్మెల్యే యెన్నం కిట్ లను అందజేశారు. ప్రజా ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని ఏ సమస్య ఉన్న చెప్పాలని సూచించారు. అనంతరం నగరంలోని షాషాబ్ గుట్ట లో నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుమల్ మమత, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, డివిజన్ల కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు అధికారులు ఉన్నారు.