6 April, 2026 | 1:40 PM

ఆర్‌ఆర్‌ఆర్ నార్త్‌లో భూములు ఖాళీ చేయించొద్దు

07-05-2024 12:39 AM

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ

హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): రీజినల్ రింగ్ రోడ్(ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర భాగం నిర్మాణంలో భూమి కోల్పోతున్న పిటిషనర్లను వాళ్ల భూముల నుంచి ఖాళీ చేయించవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు భూమి నుంచి పిటిషనర్లను వెళ్లగొట్టొద్దని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ)ను హైకోర్టు ఆదేశించింది. అయితే భూసేకరణ ప్రక్రియను మాత్రం కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది.  ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 14కు వాయిదా వేసింది. ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణంలో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం పాములపర్తి గ్రామంలో సర్వే నంబర్ 263లో 14 ఎకరాల భూ యజమాని కట్ట ఆరులప్ప, మెదక్ జిల్లా తూప్రాన్ మండ లం ఇస్లాంపూర్ గ్రామం సర్వే నంబర్ 375, 377, 336లోని 9.03 ఎకరాల భూమి మొత్తం పోతోందని శ్రీరాంరెడ్డి వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లను దాఖలు చేశారు.

ఈ పిటిషన్లను న్యాయమూర్తి జస్టిస్ కాజా శరత్  విచారణ జరిపి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్‌హెచ్ 44, ఆర్‌ఆర్‌ఆర్ ఇంటర్ జంక్షన్‌ను దాదాపు 60 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. దీని కోసం మే 25, 2022న ఇచ్చిన 3ఏ నోటిఫికేషన్.. ఆగస్టు 8, 2023న జారీ చేసి న 3డీ ఎన్‌హెచ్‌ఏఐ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్లను వారు సవాల్ చేశారు. దాదాపు 4,704.25 ఎకరాల్లో ఎన్‌హెచ్‌ఏఐ ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణం చేపట్టనుంది. ఇందు లో దాదాపు 4,315.33 ఎకరాలు ప్రైవేట్ భూమిని సేకరిస్తున్నారు. అంటే మొత్తం భూ సేకరణలో ప్రైవేట్ భూమి వాటా 91.73 శాతం.. ప్రభుత్వ భూమి 5 శాతం.. అటవీ భూమి 3.27 శాతమని తెలిపారు. ప్రైవేట్ భూమి శాతాన్ని తగ్గించే అవకాశం ఉన్నా.. ప్రభుత్వం ఆ ఇతర మార్గాలవైపు దృష్టి సారించలేదని వివరించారు. 

పిటిషనర్ల తరఫున న్యాయవాది గౌరారం రాజశేఖర్‌రెడ్డి వాదనలు వినిపించారు. జాతీయ రహదారుల చట్టాన్ని పాటించడంలో పలు వ్యత్యాసాలు ఉన్నందున 3ఏ, 3డీ నోటిఫికేషన్‌ను కొట్టివేయాలని కోరారు. భూమి కోల్పోతున్న వారిని గుర్తించాలని, 3డీ నోటిఫికేషన్ కంటే ముందే రిహాబిలిటేషన్ అండ్ రిసెటిల్మెంట్(ఆర్‌ఆర్) ప్యాకేజీ అమలు చేయాల్సి ఉందన్నారు. రోడ్డు ప్రాజెక్టులకు భూసేకరణ ఉపశమనం, పునరావాస చట్టం 2013 అమలు కాదని, ఆర్‌ఆర్ ప్యాకేజీ ముందే అమలు చేయాల్సిన అవసరం లేదని ఎన్‌హెచ్‌ఏఐ న్యాయవాది వాదించారు. వాదనల తర్వాత హైకోర్టు, కేంద్ర రోడ్డు రవాణా శాఖ కార్యదర్శి, ఎన్‌హెచ్‌ఏఐ తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈలోగా ప్రతివాదులు తమ వాదనలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.