లీవ్ పెట్టకుండా డుమ్మా కొడ్తారా?
వైద్యులపై స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్
జనగామ, జూన్ 10 (విజయక్రాంతి): విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వైద్యులను హెచ్చరించారు. సోమవారం స్టేషన్‌ఘన్‌పూర్ పీహెచ్‌సీలో తనిఖీలు చేపట్టారు. ౮ మంది వైద్యులకు ఐదుగురే ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజిస్టర్‌ను పరిశీలించారు. లీవ్ పెట్టకుండా విధులకు రాకపోవడమేంటని ప్రశ్నించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. విధులకు హాజరు కాని సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.
పీహెచ్‌సీకి డయాలసిస్ సెంటర్ మంజూరైందని, ప్రసూతి మహిళలకు ప్రత్యేకవార్డు ఏర్పాటు చేయాల్సి ఉందని, వంద పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ లింగారెడ్డి, పద్మశాలీ సంఘం నాయకుడు దామోదర్‌నేత, బీసీ రాజ్యాధికార సమితి నేత కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు.






