కలెక్టరేట్‌లో ఉద్యోగాలని టోకరా
రూ.2.60 లక్షలు తీసుకొని ఉడాయింపు
ప్రజావాణిలో కలెక్టర్‌కు బాధితుల ఫిర్యాదు
జగిత్యాల, జూన్ 10 (విజయ క్రాంతి )ః కలెక్టరేట్‌లో ఉద్యోగాల పేరిట జరిగిన ఘరానామోసం జగిత్యాల ప్రజావాణిలో సోమవారం వెలుగు చూసింది. పట్టణానికి చెందిన నాగిశెట్టి మహేశ్, పెద్దపల్లి ప్రాంతానికి చెందిన పిడుగు రవీందర్, రవి, నాగ రాజు, శ్రీనివాస్‌రెడ్డి కలెక్టరేట్‌లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ పలువురిని నమ్మించారు. ఈక్రమంలో రాధ, లక్ష్మీ, గణేశ్ వారికి రూ.2.60 లక్షలు ముట్టజెప్పారు. తీరా వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం మోసపోయామని గుర్తించారు. సోమవారం కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషకు మొరపెట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని పోలీసులను కలెక్టర్ ఆదేశించారు.
పురుగులమందు డబ్బాతో రైతు
మంచిర్యాల, జూన్ 10 (విజయక్రాంతి) : పురుగులమందు డబ్బాతో ఓ మామిడి రైతు కలకలం సృష్టించాడు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలానికి చెందిన రైతు ప్రజావాణి వేదికలో కలవరం రేపాడు. నెన్నెల మండలం చిత్తాపూర్ గ్రామానికి చెందిన జనార్దన్ మామిడికాయలను చిత్తాపూర్ డీఆర్‌డీఏ కొనుగోలు కేంద్రం లో విక్రయించాడు. అతనితోపాటు మరో 20 మంది రైతులు కూడా అమ్మారు. నెల గడిచినా వీరికి డబ్బులు రాలేదు. డబ్బుల కోసం తిరిగినా లాభం లేకపోయింది. దీంతో రైతు జనార్దన్ మనోవ్యధకు గురయ్యాడు. తనకు రావాల్సిన లక్షన్నర ఇప్పించాలని ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణిలో మొరపెట్టుకునేం దుకు సోమవారం వెళ్లాడు. అయితే వెం ట పురుగుల మందు తెచ్చుకోవడం ప్రజావాణిలో కలకలం రేపింది.
తన డబ్బులు తక్షణ మే వచ్చేలా చూడాలని, లేదంటే చావొక్కటే మార్గమని ఎంపీడీవో దేవేందర్‌కు మొరపెట్టుకున్నాడు. వెంటనే స్పందించిన ఎంపీడీ వో.. డీపీఎం సంజీవ్‌కు ఫోన్ చేశారు. ఏపీఎం విజయలని ప్రజావాణికి రప్పించారు. రైతు సమస్యను వివరించారు. అంతే కాకుండా అమ్మేటప్పుడు కిలోకు రూ. 35 ధర చెప్పి ఇప్పుడు కిలోకి రూ.25 నుంచి రూ.28 వరకు కట్టిస్తామంటున్నారట, అలా కుదరదు మొదట ఒప్పుకున్న విధంగా మొత్తం డబ్బు లు చెల్లించాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా రైతులందరికి ఒప్పందం ప్రకారం మొత్తం డబ్బులు చెల్లించాలని సూచించారు. దీంతో రైతు శాంతించి వెళ్లిపోయాడు.






