18 April, 2026 | 2:30 PM

సుప్రీంకు చేరిన డాక్టర్ కేసు

19-08-2024 01:14 AM
  1. సంచలనంగా కోల్‌కతా వైద్యురాలి హత్యకేసు
  2. సుమోటో పిటిషన్‌గా స్వీకరించిన సుప్రీంకోర్టు
  3. బుధవారం విచారిస్తామన్న ప్రధాన న్యాయమూర్తి
  4. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వైద్యుల నిరసనలు

న్యూఢిల్లీ, ఆగస్టు 18: కోల్‌కతాలో ఆర్జీ కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ దవాఖానలో వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్యచేసిన కేసు దేశవ్యాప్తంగా ప్రకంపణలు సృష్టిస్తున్నది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో లక్షల మంది వైద్యులు విధులు బహిష్కరించి రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. పరిస్థితి తీవ్రతను గుర్తించిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ కేసును సుమోటో పిటిషన్‌గా స్వీకరించింది. మంగళవారం విచారణ ప్రారంభిస్తామని ఆదివారం ప్రకటించింది. మరోవైపు వైద్యుల నిరసనలతో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీచేసింది.  

రేపు విచారణ

ఆర్జీ కర్ దవాఖానలో దారుణ హింసకు బలైన వైద్యురాలి కేసును పశ్చిమబెంగాల్ పోలీసులు సరిగా దర్యాప్తు చేయలేదన్న విమర్శలు వచ్చాయి. దీంతో వైద్యులంతా ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. కోల్‌కతా హైకోర్టు ఈ కేసు దర్యాప్తును సీబీఐకి ఇస్తూ తీర్పు చెప్పింది. తాజాగా ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టులో శనివారం పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో ఈ కేసును సుమోటోగా స్వీకరిస్తున్నట్టు అత్యున్నత న్యాయస్థానం ఆదివా రం ప్రకటించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా సభ్యులుగా ఉన్న ధర్మాసనం మంగళవారం ఈ కేసును విచారించనున్నది. 

వైద్యుల సమ్మెపై కేంద్రం అప్రమత్తం

కోల్‌కతా వైద్యురాలి హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళన కొనసాగుతున్నది. విధులు బహిష్కరించి భారీ ప్రదర్శ నలు నిర్వహిస్తున్నారు. భద్రత లేకుండా పనిచేయలేమని తేల్చి చెప్తున్నారు. దీంతో ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ వైద్య సేవలు నిలిచిపోయాయి.  వైద్యులు తమ నిరసననను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. శాంతిభద్రతల విషయంలో  ప్రతి రెండు గంటలకు సమాచారం ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలకు సూచించింది.

దీదీ ఇదేం తీరు: మృతురాలి తండ్రి

ఆర్జీ కర్ దవాఖాన ఘటపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరును మృతురాలి తండ్రి తీవ్రంగా విమర్శించారు. ‘ముఖ్యమంత్రి సుదీర్ఘ ప్రసంగాలిస్తున్నారు. నా బిడ్డకు న్యాయం జరుగాలని రోడ్లపైకి వచ్చి ర్యాలీలు తీస్తున్నారు. అదే సమయంలో ప్రజల ఆగ్రహాన్ని తక్కువచేసి చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా నకిలీ వ్యవహా రాలెందుకు? ఆమె ప్రజలను చూసి భయపడుతున్నారా? మా ప్రశ్నలకు సమాధా నాలు కావాలి’ అని నిలదీశారు.  

టీఎంసీలో చిచ్చు

డాక్టర్ హత్య ఘటన అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చిచ్చు పెట్టింది. ఆ పార్టీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు గుప్పించుకొంటున్నారు. కళాశాల మాజీ ప్రిన్సిపాల్‌తోపాటు కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను కూడా కస్టడీలోకి తీసుకొని సీబీఐ విచారణ చేయాలని, అప్పుడే వైద్యురాలు ఆత్మహత్య చేసుకొన్నారని మొదట ఎవరు ప్రచారం చేశారో తెలుస్తుందని ఆదివారం టీఎంసీ ఎంపీ సుఖేందు శేఖర్‌రాయ్ ట్వీట్ చేశారు. సుఖేందుపై ఆ పార్టీకే చెందిన మరో నేత కునాల్ ఘోష్ విమర్శలు గుప్పించారు. పోలీస్‌కమిషనర్ ఈ కేసు దర్యాప్తులో నిజాలు తేల్చేందుకు శక్తివంచన లేకుండా కృషిచేశారని, సుఖేందు నుంచి ఇలాంటి విమర్శలు రావటం దురదృష్టకరమని విమర్శించారు.