29-11-2024 11:57:02 PM
ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు
మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల గోదావరి తీరంలో స్మశాన వాటిక నిర్మాణం పేరుతో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు వసూలు చేసిన విరాళాలను తిరిగి వారికే ఇవ్వాలని మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు. శుక్ర వారం మంచిర్యాల ప్రధాన మార్కెట్లోని రోడ్డు విస్తరణ పనులను సమీక్షించి వ్యాపారస్తులకు పలు సూచనలు చేసిన అనంతరం కాలేజ్ రోడ్లో నిర్మాణమవుతున్న స్మశాన వాటిక పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే స్మశాన వాటిక నిర్మాణం కోసం రూ. 90 లక్షల వరకు చందాల రూపంలో వసూలు చేసి నెలలు గడుస్తున్నా స్మశాన వాటిక నిర్మించలేదన్నారు.
అలాంటప్పుడు వసూలు చేసిన విరాళాలను తిరిగి దాతలకే అందజేయాలని, ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. డిసెంబర్ ఏడవ తేదీలోపు డబ్బులు తిరిగి ఇవ్వకపోతే చందాలు వసూలు చేసిన వారిపై, మధ్య వర్తులపై దాతలు పోలీసులకు ఫిర్యాదు చేస్తారని హెచ్చరించారు. అంతే కాకుండా లక్షకు రెండు లక్షలు జరిమానా రూపంలో వసూలు చేస్తారని, అవి నూతనంగా ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న వైకుంఠ దామానికి విరాళంగా ఇస్తామని తెలిపారన్నారు.
20 ఏండ్ల అభివృద్ధిని చూపిస్తా...
మంచిర్యాల నియోజక వర్గంలో రెండేండ్లలో ఇరవై ఏండ్ల అభివృద్ధిని చేసి చూపిస్తానని మంచిర్యాల ఎమ్మెల్యే పీఎస్ఆర్ ధీమా వ్యక్తం చేశారు. చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాయన్నారు. ఎన్ని శక్తులు అడ్డుకోవాలని చూసినా నియోజక వర్గ అభివృద్ధి, సంక్షేమం ఆగదని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఉన్నారు.