23-09-2025 01:09:18 AM
సెమీ కండక్టర్ పరిశ్రమలో పుష్కలంగా అవకాశాలు
2030 కల్లా 15 లక్షల ఉద్యోగాలు
-ఆత్మనిర్భర్‌తో భారత్ ఊతం
-రాష్ట్రంలోనూ సెమీకండక్టర్ రంగం అభివృద్ధికి చొరవ
-100 ఎకరాల్లో పార్క్ ఏర్పాటు
-పరిశ్రమ అవసరాలకు తగ్గట్టు నిపుణుల శిక్షణకు ఏర్పాట్లు
హైదరాబాద్, సెప్టెంబర్ 2౨ (విజయక్రాంతి): ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషిన్ లెర్నింగ్ వంటి అధునాతన సాంకేతికతలతో నిపుణుల ఉద్యోగావకాశాలకు ఎసరు వస్తుందేమోనన్న భయాల మధ్య ప్రస్తుతం ఏఐలోనే సెమీ కండక్టర్ రంగం పెద్దఎత్తున ఉపాధికి భరోసానిస్తున్నది. ఎలాంటి టెక్నాలజీతో పనిచేసే పరికరానికైనా సెమీ కండక్టర్ చిప్ అవసరం ఉంటుంది. దీంతో సెమీకండక్టర్ రంగంలో ఉపాధి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
వాస్తవానికి భవిష్యత్‌లో సెమీ కండక్టర్ రంగంలో నిపుణుల కొరత ఏర్పడే అవకాశం ఉందని పలు గణాంకాల ద్వారా స్పష్టమవుతున్నది. రాబోయే సెమీ కండక్టర్ పరిశ్రమ గణనీయంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నప్పటికీ ఆ పరిశ్రమకు సరిపడా నైపుణ్యం ఉన్న మానవ వనరులు ప్రస్తుతం అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో సెమీ కండక్టర్ నిపుణుల కొరత ఏర్పడవచ్చు.
2030 కల్లా దేశవ్యాప్తంగా 15 లక్షల మంది సెమీకండక్టర్ నిపుణుల అవసరం ఉంటుంది. దీనికి అనుగుణంగా రాబోయే ఐదేళ్లలో సెమీకండక్టర్ రంగంలో నైపుణ్యాలు అభివృద్ధి చేసుకుంటే యువతకు అద్భుతమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సెమీకండక్టర్ రంగానికి గ్లోబల్‌గా పెరుగుతున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉద్యోగాలను కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయి.
ఆత్మ నిర్భర్ భారత్‌తో ఉద్యోగాల సృష్టి..
భారతదేశంలో అంతర్జాతీయ మార్కెట్లపై ఆధారపడకుండా, స్థానిక ఉత్పత్తి, సాంకేతికత, నైపుణ్యం, మౌలిక వసతులు పెంచడం ద్వారా స్వయంసమృద్ధిగా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2020లో ఆత్మనిర్భర్ భారత్ పథకాన్ని ప్రారంభించింది. కీలక రంగాలైన ఫార్మా, సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్, వ్యవసాయం, రక్షణ రంగాలకు సంబంధించిన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి దేశీయ ఉత్పత్తిని పెంచడంపై ద్వారా ఆర్థిక స్వావలంబన పెంచుతుంది. కొత్త ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికత, పరిశోధన ప్రోత్సాహం కల్పించి ఉద్యోగ అవకాశాలను సృష్టించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నది.
ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్, ఫార్మా వంటి రంగా లకు ప్రోత్సాహకాలు అందిస్తుంది. ముఖ్యం గా సెమీకాన్ ఇండియా మిషన్ ద్వారా సెమీ కండక్టర్ ఫాబ్, డిజైన్, ప్యాకేజింగ్ యూనిట్లకు మద్దతు ఇస్తుంది. అయితే 2030 కల్లా దేశవ్యాప్తంగా సెమీ కండక్టర్ రంగానికి సంబంధించి 15 లక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగా, సమాంతరంగా పరోక్ష ఉద్యోగాల అవకాశాలు అందుబాటులోకి వస్తుండటంతో ఆత్మ నిర్భర్ భారత్ పథకం ఎంతో ఉపయోగపడనున్నది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో కీలక పాత్ర పోషించనున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సెమీ కండక్టర్ రంగంలోని కొరతకు అనుగుణంగా నిపుణులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది.
తైవాన్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం..
సెమీ కండక్టర్ రంగంలో ఏర్పడుతున్న ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడం లో భాగంగా తైవాన్‌లోని నేషనల్ యాంగ్ మింగ్ చియావో తుంగ్ యూనివర్శిటీ(ఎన్‌వైసీయూ), తైవాన్ సెమీ కండక్టర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(టీఎస్‌ఆర్‌ఐ) సంస్థలతో టెక్నాలజీ చిప్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్(టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం వ్యూహాత్మక భాగస్వామ్యం పెట్టుకున్నది. సెమీ కండక్టర్ పరిశోధన, ఆవిష్కరణ, నైపుణ్యాల అభివృద్ధికి సంబంధించి ఆ సంస్థల సహకారం తీసుకోనున్నారు. వాస్తవానికి ప్రపంచంలోని మొత్తం సెమీకండక్టర్ ఉత్పత్తుల్లో 65 శాతం తైవాన్ నుంచే కావడం విశేషం. ఈ క్రమంలో తైవాన్ సంస్థలతో భాగస్వామ్యం తెలంగాణకు లాభం చేకూర్చనున్నది.
అయి తే పరిశ్రమల అవసరాలకు తగిన మానవ వనరులు తైవాన్ దేశంలో అందుబాటులో లేవు. దీంతో ఆ దేశం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొన్నది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ రంగంలో ఏర్పడిన మానవ వనరులను కొరతను భారతదేశం అనుకూలంగా మల్చుకునే అవకా శం ఉంది. ఇందులో భాగంగా రాబోయే ఐదేళ్లలో తెలంగాణలో వేలాది మందిని సెమీకండక్టర్ నిపుణులుగా తయారుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.
వంద ఎకరాల్లో సెమీ కండక్టర్ పార్క్..
తెలంగాణలోని విద్యార్థులు, అధ్యాపకులకు చిప్ డిజైన్, సెమీకండక్టర్ ఇన్నోవేషన్ లో ప్రపంచ స్థాయి నైపుణ్యాలను అందించేందుకు తైవాన్ సంస్థలతో కలిసి సంయుక్త పరిశోధన కార్యక్రమాలు, సమకాలీన పాఠ్య ప్రణాళిక రూపకల్పన చేస్తుంది. సెమీ కండక్టర్ నిపుణులను శిక్షణకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా మొదట హైదరాబాద్‌లో 10 వేల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌లో సెమీకండక్టర్ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నది. ఆ తర్వాత హైదరాబాద్ నగరంలోనే వంద ఎకరాల స్థలంలో సెమీ కండక్టర్ పార్క్‌ను ఏర్పాటు చేసి, ప్రపంచ స్థాయి పోటీని తట్టుకునే విధంగా యువతలో నైపుణ్యాలను పెంపొందించేలా శిక్షణ ఇవ్వనున్నది.
అందు లో భాగంగా టాలెంట్ డెవలప్‌మెంట్, డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్ వంటి అంశాలపై ప్రధానంగా శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణలో భాగంగా అర్హులైన వారిని ఎంపిక చేసి రెండు నెలలు తెలంగాణలో, నాలుగు నెలల పాటు పరిశోధనాత్మక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి ఇప్పటికే అందినట్టు తెలుస్తోంది. ప్రభుత్వమూ సెమీ కండక్టర్ రంగంలో శిక్షణకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్టు సమాచారం.
అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో తెలంగాణను భారత్ సెమీకండక్టర్ విప్లవానికి లాంచ్ ప్యాడ్‌గా తీర్చిదిద్దుతాం. అందులో భాగంగా సెమీకండక్టర్ రంగంలో యువతకు శిక్షణ ఇచ్చేందుకు తైవాన్ సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యం పెట్టుకున్నాం. ప్రపంచస్థాయి సంస్థలతో భాగస్వామ్యం చేయడం ద్వారా తెలంగాణ యువతకు, గ్లోబల్ నిపుణులకు టీ వారధిగా పనిచేస్తుంది. ఈ వ్యూహాత్మక సహకారాలు విద్యార్థుల సాధికారతను పెంచి, పరిశోధనలో పురోగతిని తీసుకొచ్చి, తెలంగాణను, భారతదేశాన్ని సెమీకండక్టర్ రంగంలో అగ్రస్థానానికి తీసుకెళ్తాయి. భారత్ చిప్ విప్లవానికి తెలంగాణే లాంచ్‌ప్యాడ్ అవుతుంది.
సందీప్ కుమార్ మక్తలా, టీ వ్యవస్థాపకుడు