23-09-2025 09:03:35 AM
ఇండోర్: మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని(Indore) రాణిపుర ప్రాంతంలో సోమవారం రాత్రి కురిసిన వర్షాలకు మూడంతస్తుల ఇల్లు(Building Collapses) కూలిపోయింది. శిథిలాల నుంచి తీవ్రంగా గాయపడిన పన్నెండు మందిని రక్షించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కనీసం ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. రక్షించబడిన వారిని మహారాజా యశ్వంత్ రావు ఆసుపత్రిలో చేర్చారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని, మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉందని మహాత్మా గాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజీ డీన్ అరవింద్ ఘంఘోరియా మీడియాకి తెలిపారు.
శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నందున సంఘటన స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం భవనం 8 నుండి 10 సంవత్సరాల పురాతనమైనదని మేయర్ పుష్యమిత్ర భార్గవ(Mayor Pushyamitra Bhargava) తెలిపారు. భవనంలోని ఒక భాగం పొరుగున ఉన్న భవనంపై కూడా పడిందని మేయర్ వెల్లడించారు. ముందస్తు జాగ్రత్త చర్యగా రాణిపుర ప్రాంతంలో విద్యుత్తును నిలిపివేసినట్లు అధికారులు పేర్కొన్నారు. సోమవారం రాత్రి ఇండోర్‌లోని రాణిపుర ప్రాంతంలో కురిసిన వర్షాలకు మూడంతస్తుల ఇల్లు కూలిపోయి ఇద్దరు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. భవనం శిథిలాల కింద ఒకే కుటుంబానికి చెందిన 14 మంది చిక్కుకున్నారని జిల్లా కలెక్టర్ శివం వర్మ(District Collector Shivam Verma) తెలిపారు. ఈ విషాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.