23-09-2025 01:14:47 AM
కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500 చొప్పున..
-రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర కీలకం: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
-జీఎస్టీ సంస్కరణలతో రాష్ట్రానికి రూ.7 కోట్ల నష్టం
-ఆ నష్టాన్ని కేంద్రమే భర్తీ చేయాలని సీఎం డిమాండ్
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. దసరాకు సంబంధించిన బోనస్ లెక్క తేల్చింది. సింగరేణి లాభాల్లో కార్మికుల వాటా 34శాతమని తేల్చింది. ఒక్కో కార్మికుడి ఖాతాల్లో పండుగకు ముందే 1.95 లక్షలు జమ చేస్తామని స్పష్టం చేసింది. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల ఖాతాల్లో రూ.5,500 చొప్పున జమ చేస్తామని తెలిపింది. సోమవారం ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, సింగరేణి సీఎండీ బలరాంతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
సంస్థవ్యాప్తంగా పనిచేస్తున్న 41 వేల మంది శాశ్వత ఉద్యోగుల ఖాతాల్లో రూ.1,95,610 చొప్పున, 30 వేల మంది కాంట్రాక్టు కార్మికుల ఖాతా ల్లో రూ.5,500 జమ చేస్తామని స్పష్టం చేశారు. పన్నులు పోను సింగరేణికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.6,394 కోట్ల లాభం వచ్చిందని, దీనిలో సంస్థ విస్తరణకు రూ.4,034 కోట్లను పెట్టుబడి పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇక నికరంగా మిగిలిన లాభం రూ.2,360 కోట్లని, దీనిలో 34 శాతమంటే.. రూ.819 కోట్లను శాశ్వత కార్మికులు, కాంట్రాక్టు కార్మికులకు దసరా బోనస్‌గా ఇవ్వాలని నిర్ణయించి నట్లు వివవరించారు.
తెలంగాణ సాధన కోసం సింగరేణి కార్మికులు రాజీ పోరాటం చేశారని, వారి పోరాటాన్ని ఎప్పటికీ మరువబోమన్నారు. సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని వివరించా రు. సింగరేణిని లాభాల బాటలో నడిపించేందుకు కార్మికులు ఎంతో శ్రమిస్తున్నారని, అందుకే వారికి సంస్థ లాభాల్లో కార్మికులకు వాటా ఇస్తున్నామని వివరించారు. కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా సంస్థను తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
సంస్థలో ప్రైవేట్ భాగస్వామ్యం పెరుగుతూ పోతే భవిష్యత్‌లో మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఆ సమస్యను పరిష్కరించాల్సిన అవసరముందని, రాష్ట్రప్రభుత్వం అందుకు కేంద్రంతో చర్చలు జరుపుతుందని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంద ని హామీ ఇచ్చారు. సంస్థ లాభాల బాటలో పయనించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కోల్‌ఇండియాకు సంబంధించిన కార్మికుల బోనస్ దీపావళికి అందజేస్తామని స్పష్టం చేశారు. జాతీయ ఆదాయంలో సింగరేణి భాగస్వామ్యం ఉందని వివరించారు.
జీఎస్టీ సవరణతో రాష్ట్రానికి రూ.7 వేల కోట్లు నష్టం..
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీ సవరణల కారణంగా రాష్ట్రానికి సుమారు రూ.7 వేల కోట్ల ఆదాయం తగ్గిందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తక్షణం స్పందించి రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ అవలంబిస్తున్న ‘మేం నిర్ణయాలు తీసుకుంటాం.
మీ చావు మీరు చావండి’ విధానం సరైంది కాదని దుయ్యబట్టారు. జీఎస్టీ సవరణలతో రాష్ట్రానికి జరిగిన నష్టంపై డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కేంద్రానికి లేఖ రాస్తారని వివరించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చొరవ తీసుకుని సమస్యను కేంద్రానికి వివరించి, రాష్ట్రానికి ఐదేళ్ల పాటు కేంద్రం నుంచి వయబులిటీ గ్యాప్ ఫండ్ విడుదలయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఇటీవల ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క హాజరై, రాష్ట్రం తరఫున నివేదిక సైతం సమర్పించారని గుర్తుచేశారు. సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్ బాబు, వివేక్, ఎంపీలు రఘురాంరెడ్డి, బల రాం నాయక్, సింగరేణి సీఎండీ బలరాం, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభు త్వ సలహాదారులు షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్, సింగరేణి బెల్ట్ ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.
కోల్పోయిన రెండు బ్లాక్‌లను తీసుకొస్తాం: భట్టి విక్రమార్క
తెలంగాణకు సింగరేణి ఆత్మ లాంటిదని, రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం గతంలో బొగ్గు గనులకు వేలం నిర్వహిస్తే, గత రాష్ట్రప్రభుత్వం సంస్థను వేలంలో పాల్గొనకుండా చేసిందని, ఫలితంగా సంస్థ రెండు బొగ్గు గనులు ఆ ప్రభుత్వానికి అనుకూలమైన వ్యక్తుల పరం అయ్యాయని ఆరోపించారు.
ఆ రెండు గనులు సింగరేణిపరమైతే బొగ్గు ఉత్పత్తి రంగంలో సంస్థ మరింత ముందుకు వెళ్లేదని అభిప్రాయపడ్డారు. సంస్థ కోల్పోయిన రెండు బ్లాకులను తమ ప్రభుత్వం తిరిగి తెచ్చేందుకు కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ అంశంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని గుర్తుచేశారు. సింగ రేణి బొగ్గు ఉత్పత్తితో పాటు క్రిటికల్ మినరల్స్ మైనింగ్‌లోనూ ప్రవేశిస్తుందని వివరిం చారు. సంస్థ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మైనింగ్ రంగంలోకి దూసుకెళ్లాలని తమ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకున్నదని వెల్లడించారు.
దీనిలో భాగంగానే సంస్థ ఇటీవల కర్ణాటకలో రాగి, బంగారు గనుల మైనింగ్ హక్కులు సాధించుకున్నదని తెలిపారు. సింగరేణి ఆయా గనులను అన్వేషించి, తవ్వకాలు చేపట్టి వాస్తవ నిల్వలను గుర్తిస్తుందని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఈ మైన్స్‌ను దక్కిం చుకున్న వారు గని జీవితకాలం 35 శాతం రాయల్టీ సింగరేణి సంస్థకు చెల్లించాల్సి ఉంటుందన్నారు. సింగరేణిని విస్తరించేందుకు ప్రైస్ వాటర్ కూపర్, కేపీఎంజీ వంటి సంస్థలను కన్సల్టెన్సీలుగా నియమించుకున్నదని వివరించారు.