23-09-2025 01:11:52 AM
స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తే సర్కారు దిగివస్తుంది..
-బాధిత రైతుల పక్షాన బీఆర్‌ఎస్ పోరాటం
- సెలవు రోజుల్లో హైడ్రా కూల్చివేతలేంటి?
-హైకోర్టు మొట్టికాయలు వేసినా సీఎం మారలే!
- ‘జూబ్లీహిల్స్’లో కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పండి
-బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్‌ఆర్) బాధితులంతా ఏకతాటిపైకి రావాలని, అంతా ఒక్కటై స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తే రాష్ట్రప్రభుత్వ దిగిరాక తప్పదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. గ్రామగ్రామాన తీర్మానాలు చేసి ఎన్నికలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ట్రిపుల్‌ఆర్ అలైన్‌మెంట్ మార్పుతో నష్టపోతున్నామని నల్గొండ, సూర్యాపేట, మెదక్, సిద్దిపేట జిల్లాలకు చెందిన పలువురు బాధితులు సోమవారం హైదరాబాద్‌కు వచ్చి తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిశారు. అలైన్‌మెంట్ మార్పు కారణంగా తమ విలువైన భూములను నష్టపోతామని గోడు వెళ్లబోసుకున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ట్రిపుల్‌ఆర్ నిర్వాసితులకు పూర్తి అండగా ఉంటామని హామీ ఇచ్చా రు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో నల్లగొండ జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేశామని, ‘మిషన్ భగీరథ’ పథకం అమలు చేసి ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టామని పేర్కొన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీలను నమ్మి, ఓటేసి గెలిపించిన రైతులను.. ఆ తర్వాత మోసం చేసిందని మండిపడ్డారు. రైతులకు బీఆర్‌ఎస్ అండగా నిలబడి, కాంగ్రెస్ పార్టీ స్వార్థపూరిత నిర్ణయాలకు మోసపోకుండా చూసుకుంటుం దని భరోసానిచ్చారు.
ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ ఎన్నికల సమయంలో ట్రిపుల్‌ఆర్‌తో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండబోదని హామీ ఇచ్చారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం అలైన్‌మెంట్ మార్చి రైతులకు నష్టం కలిగేలా వ్యవహరిస్తున్నదని నిప్పులు చెరిగారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యమిచ్చిందని, తద్వారా వ్యవసాయ రంగాన్ని సుభిక్షం చేసిందని కొనియాడారు.
గతంలో భూసేకరణ సమస్యలు ఎదురైనప్పుడు తమ ప్రభుత్వం రైతు లతో నేరుగా చర్చలు జరిపేదని, తద్వారా వారికి పునరావాసం కల్పించేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆర్‌ఆ ర్‌ఆర్ విషయంలో అలైన్‌మెంట్లు మార్చిందని, తద్వారా పేదల, రైతుల జీవితాలను ఆగం చేస్తోందని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంట్ వేదికగా ట్రిపుల్‌ఆర్ బాధితుల సమస్యలను లేవనెత్తుతారని, రైతులు ఆత్మస్థుర్యైన్ని కోల్పోకుండా ఉండాలని సూచించారు. సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా కు చెందిన బీఆర్‌ఎస్ నేతలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌కు ఓటేస్తే బుల్డోజర్ వ్యవస్థకు లైసెన్స్..
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే, ఇండ్లు కూలగొట్టమని రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యానికి లైసెన్స్ ఇచ్చినట్టేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో సోమవారం బీఆర్‌ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తలతో నిర్వహిం చిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
సెలవు రోజుల్లో కూల్చివేతలు వద్దని హైకో ర్టు గతంలోనే ఆదేశాలిచ్చిందని, అయినప్పటికీ సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం హైడ్రాను రంగంలోకి దించి గాజులరామారంలో కట్టడాలను కూల్చివేసిందని మండిపడ్డారు. మున్ముందు బోరబండ బస్తీకీ సీఎం బుల్డోజర్లు పంపిస్తారని, కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొట్టిన ప్రతి బీఆర్‌ఎస్ కార్యకర్త కట్టడాన్ని, బీఆర్‌ఎస్ మళ్లీ కట్టించి తీరుతుందని హామీ ఇచ్చారు. సీఎం బుల్డోజర్లు పేదల ఇండ్లపైకే వెళ్లాయని, పెద్దల ఇండ్లవైపు అస్స లు వెళ్లవని మండిపడ్డారు.
తన సోదరురులతోపాటు మంత్రులు పొంగులేటి, వివేక్ ప్రభుత్వ స్థలాలు, చెరువులపెన ఇండ్లు కట్టి నా సీఎం వాటి జోలికి వెళ్లడం లేదని దుయ్యబట్టారు. శని, ఆదివారాలు చూసుకుని పేదల ఇండ్లపైకి మాత్రం బుల్డోజర్లను పంపిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, కాం గ్రెస్.. దొందూ దొందేనని.. హిందువులు, ముస్లింలని మతాల మధ్య చిచ్చు పెడతాయని ఘాటుగా విమర్శించారు. ‘అప్పు పుట్ట ట్లేదు అని ఏ రాష్ట్ర సీఎం అయినా చెప్తారా? ఒక రాష్ట్ర సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తా రా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ను గెలిపించుకుని సీఎంకు గట్టిగా బదులిద్దామని పిలుపునిచ్చారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం హైదరాబాద్ నగరానికి తాగునీటి సరఫరా ఆపేస్తుందని, కాబట్టి జూబ్లీహిల్స్, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌కు మాత్రమే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ తాజాగా హెచ్ వీసా గురించి మాట్లాడతారని అందరూ అనుకుం టే, ఆయన మాత్రం జీఎస్టీ సవరణల గురిం చి మాట్లాడారని విమర్శించారు. మొన్నటి దాకా జీఎస్టీ రూపంలో ప్రజల రక్తం తాగి, ఇప్పుడు జీఎస్టీ తగ్గించి పండగ చేసుకో అంటున్నారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీకి, బీజేపీకి మతం పేరు మీద రాజకీయం చేయటం మాత్రమే వచ్చని మం డిపడ్డారు.