23-09-2025 01:06:08 AM
తెలంగాణాలో పెట్టుబడులు పెట్టండి
ఇటలీ పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి) : దేశంలోనే అతిపెద్ద ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్‌గా దూసుకెళ్తున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఇటలీ పారిశ్రామికవేత్తలను రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. సోమవారం సచివాలయంలో ఆ దేశానికి చెందిన ప్రముఖ ఏర్పోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమల ప్రతినిధులతో మంత్రి ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
కాంపోనెంట్ తయారీ, సప్లు చైన్, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్(ఎమ్మార్వో), అవియానిక్స్, రాడార్ అండ్ సెన్సార్ సిస్టమ్స్, న్యూ-స్పేస్ అండ్ చిన్న ఉపగ్రహాలు, అడ్వాన్స్ డ్ మెటీరియల్స్ అండ్ కంపోజిట్స్ తయారీలో తెలంగాణలో ఉన్న అవకాశాలు, అనుకూలతలను మంత్రి వారికి వివరించారు. రాష్ర్టంలో ప్రత్యేక ఏరోస్పేస్ పార్కులు, సెజ్‌లు, భారీ ఎంఎస్ ఎంఈ నెట్‌వర్క్, శక్తిమంతమైన ఆర్ అండ్ డీ, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, అత్యుత్తమ ప్రతిభ గల మానవ వనరులు, సుస్థిర ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకత్వం, పారిశ్రామిక ప్రోత్సాహక విధానాలతో కూడిన పటిష్టమైన ఎకో సిస్టమ్ అందుబాటులో ఉందని తెలిపారు.
15రోజుల్లోనే అనుమతులు..
దేశంలో ఎక్కడా లేని విధంగా టీజీ- ఐపా స్ ద్వారా 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ ఏరో నాటి కల్ లిమిటెడ్, డీఆర్‌డీఓ లాంటి కేంద్ర సంస్థ లు, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, ధ్రువ స్పేస్, స్కురైట్ స్పేస్, బోయింగ్, లాక్‌హీడ్ మార్టి న్, జీఈ ఏవియేషన్, ప్రాట్ అండ్ విట్నీ లాంటి దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థ లు తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేస్తున్నాయని పేర్కొన్నారు.
హై ప్రెసిషన్ మెషినింగ్, షీట్ మెటల్, హైడ్రాలిక్ సిస్టమ్స్ వంటి క్లిష్టమైన భాగాలను ఇక్కడ తయారీ చేసి, అంతర్జాతీయ మార్కెట్‌కు సరఫరా చేయొచ్చని, విమానాలు, హెలికాప్టర్ల ఇంజిన్ల నిర్వహణలో ఇటలీకి ఉన్న నైపుణ్యం ఇక్కడి డిఫెన్స్, ప్రైవేట్ రంగాలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ‘అవియానిక్స్, రాడార్ అండ్ సెన్సార్ సిస్టమ్స్‌లో ఇటలీ కంపెనీలకు అపార అనుభవం ఉంద ని, ఈ రంగానికి చెందిన వస్తువులను ఇక్కడ ఉత్పత్తి చేస్తే దేశ రక్షణ రంగం అవసరాలు తీరుతాయని, ఇతర దేశాలకు ఎగుమతి చేయొచ్చునని తెలిపారు.
ధ్రువా స్పేస్, అనంత్ టెక్నాలజీస్, స్కురైట్ వంటి హైదరాబాద్ స్టార్టప్‌లు ఇప్పటికే తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాయని, వీటితో కలిసి శాటిలైట్ సబ్-సిస్టమ్స్, పేలోడ్స్ తయారీలో భాగస్వామ్యం కావొచ్చని, తేలికైన, అధిక బలం కలిగిన కంపోజిట్స్ తయా రీలో ఇటలీకి ఉన్న ప్రత్యేక పరిజ్ఞానానికి ఇక్కడ అధిక డిమాండ్ ఉందని తెలిపారు. ‘తెలంగాణ ఇటలీ’ మధ్య ద్వుపాక్షిక సంబంధాల బలోపేతానికి తమ ప్రభుత్వం కట్టుబ డి ఉందన్నారు.
కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్, డిఫెన్స్, ఏరోస్పేస్ డైరెక్టర్ ప్రవీణ్ పీఏ, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇటలీ ఇన్ బెంగళూరు జియాన్‌డొమెనికో మిలానో, ట్రేడ్ కమిషనర్ అంటోనియెట్టా బక్కానారి, ఇండస్ట్రియల్ ఇంటర్నేషనలైజేషన్, నేషనల్ ఎకానమీ మిషన్స్ సెక్షన్ హెడ్ సిల్వియా సిక్కారెల్లి, ప్రెసిడెన్సీ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లూగి రిగ్గియో, మల్టీ లేటరల్ సైంటిఫిక్ డిప్లోమసీ హెడ్ అలెశాండ్రో గార్బెల్లిని, వాన్‌జెట్టి ఇంజనీరింగ్ ఎస్ ఆర్ ఎల్, లియో నార్డో, లీఫ్ స్పేస్ ఎస్ పీ ఏ, ఎలిటాల్ -ఎలట్రానికా ఇటాలియానా -సోసియెటా ఏ రెస్పాన్సిబిలిటా, ఈఐఈ గ్రూప్, అరేసిస్, నానో-టెక్ ఎస్ పీ ఏ, ఈఎల్టీ గ్రూప్, ఆఫీసినా స్టెల్లారే ఎస్ పీఏ, స్టెల్లార్ ప్రాజెక్ట్ తదితర పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.