17 April, 2026 | 12:51 PM

ముగిసిన దాన్ అవగాహన వారోత్సవాలు

12-01-2026 09:10 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, కరీంనగర్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న 'దాన్' అవగాహన కార్యక్రమాలు నేటి జాతీయ యువజన దినోత్సవంతో ఘనంగా ముగిశాయి. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు రూపొందించిన దాన్ (ద్వాన్-డ్రగ్స్ అవేర్నెస్ అండ్ వెల్నెస్ నావిగేషన్-ఫర్ ఎ డ్రగ్ ఫ్రీ ఇండియా) పథకంలో భాగంగా పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.

ఇందులో భాగంగా స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవం సందర్బంగా నగరంలోని కే.ఎన్.ఆర్. ఇనిస్టిట్యూట్ లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు అవగాహనా ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ లీగల్ ఏడ్, డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేష్ హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్ రహిత భారత్ లక్ష్యం కావాలని, మాదకద్రవ్యాల మహమ్మారి నుండి సమాజాన్ని రక్షించుకోవాలని సూచించారు.

కేవలం చట్టాలే కాకుండా మాదకద్రవ్యాల వల్ల కలిగే శారీరక, మానసిక అనారోగ్యాలు, వ్యసనం నుండి బయటపడే మార్గాలపై అవగాహన పరిచారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సభ్యులు, న్యాయవాదులు పెరుక రంగయ్య, చిట్టి చంద్ర ప్రకాష్ రెడ్డి, ఏ. కిరణ్ కుమార్ లు మాట్లాడుతూ మత్తు లేని భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని అన్నారు. వారం రోజుల ప్రచారంలో జనవరి 5, 2026న ప్రారంభమై జనవరి 12న స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవం వరకు అవగాహన వారోత్సవాలు, కొనసాగాయని తెలిపారు.

జిల్లాలోని వివిధ పాఠశాలలు, కళాశాలల్లో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది గాదం స్వామి తేజ, ఇనిస్టిట్యూట్ ప్రిన్సిపల్ మారం రాజు, ఆర్థమెటిక్స్ అధ్యాపకులు గుగులోత్ గోపి, పారా లీగల్ వాలంటీర్ భామండ్లపల్లి రమేష్, సైబర్ వారియర్ గజ్జల అశోక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు బాధ్యతాయుతమైన దేశ పౌరుడిగా డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.