31 March, 2026 | 3:18 AM

దాతల సొమ్ము ధర్మకర్తల జేబుల్లోకి..

31-03-2026 01:23 AM
  1. కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయ ఆలయ అభివృద్ధిని దోస్తున్న ధర్మకర్తలు

ఈవోకు ఫిర్యాదు చేసిన భక్తులు, దాతలు 

ఎండోమెంట్  కమిషనర్ దృష్టికి తీసుకెళ్తా: ఈవో

అవినీతి ఆరోపణలను గతంలోనే వెలుగులోకి తెచ్చిన ‘విజయక్రాంతి’ 

ఎల్బీనగర్, మార్చి 30: కర్మన్‌ఘాట్‌లోని ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో దాతలు ఇచ్చిన విరాళాలను ధర్మకర్తలే కాజేస్తున్నారు. ఆలయ అభివృద్ధి కోసం భక్తులు సమర్పించిన విరాళాలను, కొంతమంది ధర్మకర్తలు అభివృద్ధి పనులకు వినియోగించకుండా, తమ స్వంత అవసరాలకు వాడుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవినీతి ఆరోపణల విషయంపై ఫిబ్రవరి 23న ‘కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం?’ అనే శీర్షికతో విజయకాంత్రి దినపత్రికలో వెలుగులోకి తెచ్చింది.

మూడు నెలల క్రితం ధ్యానంజనేయ స్వామి ఆలయాభివృద్ధికి ఒక దాత ఇచ్చిన లక్ష రూపాయలను ఒక ధర్మకర్త సొంతానికి వాడుకున్నారు. అంతేకాకుండా, కొంతమంది ధర్మకర్తలు ఆలయ సిబ్బందిపై అజమాయిషీ చేస్తూ, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై పూర్తి విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మాజీ ధర్మకర్తలు, భక్తులు సోమవారం ఆలయ ఈవోకు వినతి పత్రం అందజేశారు. దీనిపై ఈవో లావణ్య మాట్లాడుతూ... విరాళాల దుర్వినియోగ విష యం తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

చైర్మన్ రాజీనామా చేయాలి... 

ఈ సందర్భంగా మాజీ ధర్మకర్తలు సతీశ్ గౌడ్, మల్లేశ్ గౌడ్, యాదిరెడ్డి, భక్తులు చందు యాదవ్, వసంత్, తనికేశ్ తదితరులు మాట్లాడుతూ... రెండు రోజుల క్రితం ధర్మకర్తను దాత నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. పార్కింగ్ నిర్వాహకుడితోపాటు కొబ్బరి చిప్పలు సేకరించుకునే వారి నుంచి ఇద్దరు ధర్మకర్తలు నిర్బంధంగా బలవంతంగా వసూలు చేశారని ఆరోపించారు. ఆలయ చైర్మన్, ఈవో అలసత్వం నిర్లక్ష్యం వల్లనే దాతలు ఇచ్చిన విరాళాలు పక్కదారి పడుతున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్ సత్యనారాయణ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

అవినీతి ఆరోపణలు ఇలా వెలుగులోకి వచ్చాయి..

కాగా, మూడు నెలల క్రిందట ఓ దాత  లక్ష రూపాయలను ఆలయ అభివృద్ధికి అందజేయాలన్న ఉద్దేశంతో ఆలయ చైర్మన్ సత్యనా రాయణ రెడ్డికి ఫోన్ చేయగా, తాను ఆలయానికి ఆలస్యంగా వస్తానని ఆలయంలో మరె వరికైనా ధర్మకర్తకు ఇవ్వమని చెప్పడంతో ధర్మకర్త తోకటి కిరణ్‌కు అందజేసి వెళ్లిపోయారు.

ఈ విషయం కొన్ని రోజుల తర్వాత పలువురు ధర్మకర్తలు దాత ఇచ్చిన లక్ష రూపాయలు గురించి కిరణ్ ను నిలదీయగా, దాతకు తిరిగి ఇచ్చేశానని, సదరు దాతనే ఆలయంలో పని చేపిస్తానని డబ్బులు తిరిగి తీసుకున్నాడని చెప్పడంతో ఆ విషయాన్ని అంతటితో వదిలేశారు. తీరా చూస్తే మూడు నెలల తర్వాత ఆ దాత ఆలయానికి వచ్చి లక్ష రూపాయలతో ఏం పని చేశారని? సదరు ధర్మకర్తను నిలదీయడంతో ఈ విషయం బయటపడింది. 

ఆలయంలో అవినీతి తిమింగలాలు 

కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మకర్తలు అర్చకులను, పార్కింగ్ నిర్వాహకుడు, కొబ్బరి చిప్పలు సేకరించుకునే వారిని కూడా వదలేదు. ముఖ్యంగా ఇద్దరూ ధర్మకర్తలు ఇష్టా నుసారంగా అక్రమ వసులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ అర్చకుడి నుంచి డైరీలు  ముద్రిస్తామని రూ.4 0 వేలు వసూలు చేశారు. కానీ మరో అర్చకుడి తో 50 డైరీలు తెప్పించి మమ అనిపించారు.

మిగతా సొమ్మును దర్జాగా జేబులో వేసేసుకున్నారు. ఇదిలా ఉండగా  అర్చకులకు మంచి ఆదా యం వచ్చే ఉప ఆలయాల్లో విధులు నిర్వహించుకునే విధంగా చూస్తామని వారి దగ్గర సైతం లక్ష రూపాయల వసూలు చేశారని ఆరోపణలు ఆ ఇద్దరి ధర్మాకర్తలపై వినబడుతున్నా యి. ఈ తతంగం అంతా నడిపింది  ఆలయం లో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ మధ్యవర్తిగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటిని విచారణ చేపట్టి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని  భక్తులు, స్థానికులు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.