calender_icon.png 3 May, 2025 | 1:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృతఘ్నులం కావద్దు!

28-11-2024 12:00:00 AM

అన్నింటికంటే పెద్ద దుర్గుణం ‘కృతఘ్నతను ప్రదర్శించడం’ అని మన పెద్దలు అంటారు. కృతజ్ఞతను చాటుకోవడం కనీస మానవ కర్తవ్యం. సమయానుకూలంగా ప్రతిస్పందించడం, సహాయం చేసిన వారికి ప్రణమిల్లడం, ప్రకృతి మాతకు కృతజ్ఞతలు తెలపడం, ఆహార ధాన్యాలను ఇచ్చిన భూమాతను ఆరాధించడం, ప్రత్యక్ష దేవుళ్లు అయిన సూర్యచంద్రులకు ధన్యవాదాలు తెలుపడం, పేదలకు సహాయ పడడం, అభాగ్యులకు దానధర్మాలు చేయడం..

వంటి సుగుణాలు మన వ్యక్తిత్వానికి వన్నె తెస్తాయి. ఆయా సందర్భాల్లో ప్రేమ, భక్తి, స్నేహ పూర్వక కృతజ్ఞతలు తెలపడం మనందరి కనీస కర్తవ్యంగా అలవాటు కావాలి. సహాయం తీసుకొని ధన్యవాదాలు తెలపని వారిని సంస్కారం హీనులుగా ముద్ర వేసి దూరం పెడుతుంది నేటి పౌర సమాజం.

ప్రతి ఏటా నవంబర్ 4వ గురువారం (నేడు) అమెరికాసహా పలు దేశాలు ‘థాంక్స్ గివింగ్ డే’ లేదా ‘కృతజ్ఞతలు తెలిపే దినం’గా పాటించే ఆనవాయితీ 1941 నుంచి కొనసాగుతున్నది. ఈ వేడుకలను ముఖ్యంగా క్రైస్తవులు తప్పనిసరిగా జరుపుకుంటారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ ప్రతిపాదించిన ఈ ప్రత్యేక సందర్భాన్ని ప్రపంచ స్థాయిలో ప్రజలు ఒక ఉత్సవంగా నిర్వహిస్తారు. పంటలను చేతికిచ్చే భూమాతకు కృతజ్ఞతగా కూడా ఈ వేడుకలు జరుపుకుంటారు. పంటకోతల పండుగగా నిర్వహించే సాంప్రదాయం కొన్ని దేశాల్లో ఉన్నది.

మరికొన్ని దేశాల్లో ఫుట్‌బాల్ వంటి క్రీడలను కూడా ఈ సందర్భంగా నిర్వహిస్తారు. సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్న వైద్యులు, రైతులు, పారిశుధ్య సిబ్బంది, ఉద్యోగులు, స్వచ్ఛంద కార్యకర్తలతోపాటు కష్టాల్లో మనలను ఆదుకునే చేతులు ఏవైనా.. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపే పద్ధతి నిజంగా అభినందనీయం.

అయితే, మనం సహాయం చేసినపుడు కృతజ్ఞతల కోసం ఎదురు చూడడం కూడా బావుండదు. ‘ఏరు దాటగానే తెప్ప తగలేసే’ అవకాశవాదులకు కృతజ్ఞత విలువ తెలియదు. ‘ఆల్‌వేస్ బి థాంక్‌పుల్ టు హెల్పింగ్ హ్యాండ్’ అన్నది మన విధ్యుక్తధర్మంగా మారాలి. ‘థాంక్స్’ అనే రెండక్షరాల పదానికి ఉన్న శక్తి తెలియని వారుంటారా!

 డా. బుర్ర మధుసూదన్‌రెడ్డి