calender_icon.png 3 May, 2025 | 12:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగ నిర్మాణంలో ఉక్కు మహిళలు

27-11-2024 12:00:00 AM

మాడభూషి శ్రీధర్ :

రాజ్యాంగ నిర్మాణంలో ఎందరో మహానుభావులు (299 మంది సభ్యులు) పాలుపంచుకున్నారు. (ముందు అఖండ భారత్‌లో 389 మంది రాజ్యాంగ నిర్ణాయక సభలో ఉంటే దేశ విభజన తర్వాత 90 మంది పాకిస్తాన్‌కు మిగిలిపోతే మన ఇండియాలో రాజ్యాంగ నిర్మాణ కృషిలో 299 మంది సభ్యులు పాల్గొన్నారు). మొత్తం రాజ్యాంగ నిర్ణాయక సభలో 15 మంది మహిళలు ఉన్నారు.

వారంతా ఉక్కు మహిళలు, వజ్రసంకల్పం కలిగిన వారు. రెండు సంవత్సరాల 11 నెలల 17రోజులపాటు చర్చించి మన రాజ్యాంగాన్ని రూపొందించారు. ఆ మహిళామణుల గురించి సంక్షిప్తంగానైనా చెప్పడం మన బాధ్యత. ఇన్నాళ్లూ వారిని మనం గుర్తుంచుకోకపోతే న్యాయం కాదు. 

అమ్మూ స్వామినాథన్ (ఏవి 

అమ్మకుట్టి 22.4.1894 --- 4.7.1978)

కేరళ పాల్ఘాట్ జిల్లాలో అగ్రవర్ణానికి చెందిన వారు. భారత మహిళా సంఘాన్ని ఆమె 1917లో ప్రారంభించారు. అన్నీ బేసంత్, మార్గెరెట్ సోదరులు, మాలతి పట్వర్ధన్, దాదాభాయ్ అంబుజమ్మాల్‌తో కలిసి ఈ సంఘాన్ని నిర్మించారు. మద్రాస్ రాజ్యాంగ అసెంబ్లీ స్వాతంత్య్ర సమరయోధురాలు ఆమె. 1952లో రాజ్యసభకు ఎన్నికైనారు. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ అధ్యక్షులుగా 1960 నుంచి 65 దాకా పనిచేశారు.

1975లో అంతర్జాతీయ మహిళా సంవత్సర ప్రారంభోత్సవం నాడు ‘ఈ సంవత్సర మాత’ (మదర్ ఆఫ్ ది ఇయర్) గా సన్మానించారు. ఏ చదువు రాకపోయినా సుబ్బరామ స్వామినాథన్‌తో పెళ్లి తరువాత ఆమె చదువుకున్నారు. అవి మహిళలకు చదువుకోవడం సాధ్యం కాని రోజులు. కనుక ఇంటిదగ్గరే ట్యూషన్ ద్వారా చదువుకుని, నేర్చి ఆంగ్లభాషా నిపుణులైనారు. మహాత్మాగాంధీ సిద్ధాంతా లను విశ్వసించి భారత స్వాతంత్య్రం కోసం పోరాడారు.

దాక్షాయణి వేలాయుధన్ (04.07.1912-- -20.07.1978)

తొలి దళిత పట్టభద్రురాలు. ఆమెకు తొమ్మిది మంది సోదరులు. ఆమె 1946లో రాజ్యాంగ అసెంబ్లీకి ఎన్నికైనారు. 1945లో దాక్షాయణి కొచ్చిన్ విధాన మండలికి ఎన్నికైనారు. గాంధీ అభిమాని అయిన దాక్షాయణి బీఆర్ అంబేద్కర్‌తో కలిసి షెడ్యూల్డ్ కులాల వారి అభ్యున్నతి కోసం కృషి చేశారు. విడి నియోజకవర్గాల ఏర్పాటు విషయంలో ఆమె అంబేద్కర్‌తో విభేదించారు. వికేంద్రీకరణ నియమాల గురించి రాజ్యాంగంలో అంబేద్కర్‌తో రాజ్యాంగ సభలో వాదించారు.

బేగమ్ ఐజాజ్ రసూల్ (02.04.1909- --01.--08--.200౧)

మాలె కోట్లలో రాజకుటుంబంలో జన్మించారు. నవాబ్ ఐజాజ్ రసూల్‌ను వివాహం చేసుకున్న తరువాత రాజ్యాంగ అసెంబ్లీకి ఎన్నికైన ముస్లిం ఏకైక మహిళా సభ్యురాలు. భారత ప్రభుత్వ చట్టం 1935 కింద ఈ దంపతులు 1937 ఎన్నికలలో యూపీ శాసనసభకు గెలిచారు. దేశ విభజన తరువాత భారత ముస్లిం లీగ్ తరఫున రాజ్యాంగ సభకు ఎన్నికైనారు.

ముస్లిం మైనారిటీ వారికి విడిగా నియోజక వర్గాలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను వ్యతిరేకించారు. ఇది శాశ్వతంగా మెజారిటీ నుంచి మైనారిటీలను దూరం చేసే విధానమని విమర్శించారు. 1949లో ముస్లిం సభ్యులు వేరు నియోజక వర్గాలను సమర్థించారు. తరువాత 1952లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. తర్వాత యూపీ శాసన సభ్యురాలిగా ఎన్నికైనారు. 

దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ (15.07.1909-- -09.05.1981)

రాజమండ్రిలో ఉన్నప్పుడు 12 సంవత్సరాల వయసులోనే స్వాతంత్య్రోద్యమం లో చేరారు. మద్రాస్ నగరంలో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులుతో కలిసి సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహాలలో పాల్గొన్నారు. 1936లో ఆంధ్ర మహిళా సభను ఆమె ప్రారంభించారు. తరువాత ఆంధ్ర మహిళా సహాయ సంఘంలో అధ్యక్షురాలుగా ఎన్నికైనారు.

రాజ్యాంగ నిర్ణాయక సభలోని అనేక అధ్యక్షులలో దుర్గాబాయ్ ఏకైక అధ్యక్షురాలు ప్యానెల్‌గా ఉన్నారు. సాంఘిక సంక్షేమ చట్టాలను రూపొందించడానికి రాజ్యాంగంలో పాల్గొన్నారు. ప్రణాళికా సంఘంలో దుర్గాబాయ్ సభ్యురాలిగా చేరారు. తరువాత ఆమె మొదటి మహిళా అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు. కుటుంబ సమస్యల వివాదాలను త్వరగా పరిష్కరించడానికి ప్యామిలీ కోర్టు విడిగా నిర్మించాలని పోరాడారు.

మద్రాస్ ప్రొవిన్స్ నియోజక వర్గం నుంచి రాజ్యాంగ నిర్ణాయక సభలో ఎన్నికైనారు. (ఎన్నికల ద్వారా గెలిచిన వారినే రాజ్యాంగ నిర్ణాయక సభ Constituent Assemblyగా పిలిచే వారు). తమిళ తదితర దక్షిణ ప్రాంతాలలో హిందీకి వ్యతిరేకత విపరీతంగా ఉంటుంది. అయినా ఆ ప్రతికూల సమస్యలలో కూడా హిందీ జాతీయ భాషగా ఉండాలని ఆమె రాజ్యాంగ సభలో వాదించారు.

హన్సా జీవ్రాజ్ మెహ్తా 

(03.07.1897-- --04.04.1995)

బరోడా దివాన్ మనుభాయ్ నంద్ శంకర్ మెహ్తా కుమార్తె హన్సా మెహ్తా ఇంగ్లాండ్‌లో జర్నలిజం (సామాజిక శాస్త్రం) చదువుకున్నారు. సంస్కరణవాది, సామాజిక ఆందోళనావాది. విద్యావేత్త. రచయిత. ఆమె మనవరాలు కరణ్ ఘేలో పేరున్న ప్రముఖమైన మొదటి గుజరాతీ నవలా రచయిత్రి. మహాత్మాగాంధీ పిలు పు విని స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. దేశ్ సేవికాదళ్‌ను 1930లో ప్రారంభిం చారు.

బాంబే శాసనసభ్యురాలిగా గెలిచారు. ‘గలీవర్ ట్రావెల్స్’తో సహా అనేక బాలల పుస్తకాలను గుజరాతీ భాషలోకి అనువదించారు. 1945--46లో అఖిల భారత మహిళా మహాసభకు ఎన్నికైనారు. 1946లో మహిళల స్థాయిలో న్యూక్లియర్ సబ్ కమిటీలో ప్రాతినిధ్యం వహించారు. 1950లో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ మొదటి ఉపాధ్యక్షురా లైనారు.

కమ్లా చౌధరీ 

(22.02.1908 - --1970)

లక్నోలో సంపన్న కుటుంబంలో జన్మించిన కమ్లా చదువుకోవడానికి పోరాడాల్సి వచ్చింది. బ్రిటిష్ సామ్రాజ్య ప్రభుత్వం నుంచి వదిలి 1930 జాతీయ ఉద్యమంలో పౌర అవిధేయ ఉద్యమం (The Civil Disobedience Movement) లో పాల్గొన్నారు.  ఉత్తర ప్రొవిన్సెస్ నుంచి 1946లో రాజ్యాంగ నిర్ణాయక సభకు ఎన్నికైనారు.

1947 నుంచి 1956 దాకా పార్లమెంట్ ప్రొవిన్సియల్ మెంబర్‌గా పని చేశారు. 54వ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు ఉపాధ్యాయులుగా ఉన్నారు. 1962లో యూపీలోని హాపూర్ జిల్లా నుంచి లోక్‌సభకు గెలిచారు. ఆమె ప్రముఖ రచయిత్రి కూడా. అనేక కథలను ప్రచురించారు.

లీలా రాయ్ 

(02.10.1900- - 11.06.1970)

అస్సాం గోల్పారా జిల్లాకు ఈమె తండ్రి డిప్యూటీ మెజిస్ట్రేట్‌గా పని చేశారు. కానీ, జాతీయ ఉద్యోమంలో సానుభూతి కలిగిన వారు. మహిళల హక్కుల కోసం అఖిల బెంగాల్ సహాయక మహిళల కమిటీ ఉపకార్యదర్శిగా పోరాడారు. వామపక్ష సంస్కరణ కోరిన వ్యక్తి. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సమీప శిష్యుడు, సహచరుడు. ఢాకాలో ఆమె బాలికల చదువుల కోసం పనిచేశారు.

1923లో స్నేహితులతో కలిసి ‘దీపాలి సంఘ’ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఢాకా, కోల్‌కతా నగరాల్లో విద్యార్థినులను చదివించడానికి ‘ఛత్రీసంఘా’ పేరున మరో సంఘాన్ని ఏర్పాటు చేశారు. మహిళల కోసమే 1931లో ‘జయశ్రీ’ పేరుతో ఒక జర్నల్ సంపాదకురాలిగా పత్రికను నిర్వహించారు. రవీంద్రనాథ్ టాగోర్ ఆశీస్సులు కూడా ఆమె సాధించారు. 

మాలతీ చౌధురీ 

(26.07.1904- - 15.03.1998)

తూర్పు బెంగాల్ (బంగ్లాదేశ్)లో జన్మించిన ఈమె 1921లో 16 సంవత్సరాల వయసులోనే శాంతి నికేతన్‌లో చేరారు. ఉప్పు సత్యాగ్రహంలో, భర్తతో కలిసి భారత జాతీయ కాంగ్రెస్ ఉద్యమంలో పాల్గొన్నారు. 

పూర్ణిమా బెనర్జీ 

(1911-- - 1951)

ఉత్తరప్రదేశ్ అలహాబాద్ జాతీయ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. 1930 నుంచి 1940 దాకా మహిళల రాడికల్ నెట్‌వర్క్‌ను నిర్మించారు. స్వాతంత్య్రోద్యమంలో పోరాడారు. సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. సోషలిస్ట్ ఆలోచనా ధార గురించి  చాలా గట్టిగా వాదించేవారు.

కిసాన్ సమావేశాలలో మాట్లాడేవారు. 1946లో యూపీ శాసనసభకు ఎన్నికైనారు. రాజ్యాంగ నిర్మాణంలో క్లాజ్ 16 ద్వారా అందరి మతాలకు సంబంధించిన చదువు నేర్పాలని, అన్ని మతాలమధ్య పోలికలను అధ్యయనం చేయాలని పోరాడారు.

మన ప్రజలకు సమిష్టిగా సార్వభౌమత్వం ఉండాలని, ఉంటుందని, కాని, ఆ పదాన్ని మన రాజ్యాంగ పీఠికలో ఉంచాల్సిన అవసరం లేదని ఎందుకంటే, అది సమిష్టిగా లభిస్తుందని వాదించారు. జనులకు ఓటుహక్కు ఉండాలని, ఏడాదికోసారి ఎన్నికలు జరగాలనీ, ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను, గెలిచిన తరువాత అమలు చేయడానికి కృషి చేయాలని వాదించారు. 

రాజ్ కుమారీ అమృత్ కౌర్ (2.02.1887- -  6.02.1964)

లక్నోలో ఆమె తొలి ఆరోగ్యశాఖ మంత్రిగా ఎన్నికై పదేళ్ల పాటు పనిచేశారు. ఇంగ్లాండ్ డోర్నెట్ షెర్బోర్న్‌లో చదువుకున్నారు. మహాత్మాగాంధీ కార్యదర్శిగా 16 సంవత్సరాలు పనిచేశారు. అఖిల భారతీయ వైద్య శాస్త్రాల సంస్థ (All India Institute of Medical Sciences -- AIIMS)ను వ్యవస్థాపితం చేయాలని, దానికి స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వాలని కోరారు.

అందుకోసం 1956లో ఈ సంస్థ చట్టాన్ని తయారు చేశారు. మహిళలకు విద్యావకాశాలు అందరికీ అందాలని కృషి చేశారు. కౌర్ యూపీ నుంచి భారత రాజ్యాంగ నిర్ణాయక సభకు ఎన్నికైనారు. సబ్ కమిటీలో ప్రాథమిక హక్కులు, మైనారిటీ సబ్ కమిటీలలో నిర్వహించారు.

రాజ్యాంగంలో యూనియన్ సివిల్ కోడ్, అందరికీ ఓటు, మత హక్కులపై జరిగిన చర్చలలో పాల్గొన్నారు. నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయించారు. భారత సంస్థ ద్వారా ఏర్పాటైన కాలేజీకి ‘రాజ్‌కుమారీ అమృత్ కౌర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్’ పేరు పెట్టారు.

రేణుకా రాయ్ 

(04.01.1904 - -1997)

లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో బీఏ చదువుకున్నారు. 1934 అఖిల భారత మహిళా కమిషన్ లీగల్ కార్యదర్శిగా ‘ప్లీ ఫర్ కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ’లో పనిచేశారు. అక్కడ ప్రొవిజనల్ పార్లమెంట్‌లో, సెంట్రల్ లెజిస్లేచర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి 1943 నుంచి 1946 దాకా సభ్యురాలిగా ఉన్నారు.

1952లో All india Womens Conference (AIWC)లో అధ్యక్షురాలుగా బాధ్యతలు నిర్వహించారు. 1952, 1962లో పశ్చిమ బెంగాల్ శాసనసభలో మంత్రిగా పనిచేశారు. లోకసభలో 1957 నుంచి 1967 దాకా మాల్డా నియోజక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 

సరోజినీ నాయుడు 

(13.02.1879 -- 02.03.1949)

ఆమె కవయిత్రి. ‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’గా పేరు పొందారు. హైదరాబాద్‌లో జన్మించారు. ఇక్కడే చదువుకున్నారు. 1925లో భారత జాతీయ కాంగ్రెస్‌లో మొదటిసారి మహిళా అధ్యక్షులైనారు. All india Womens Conference (AIWC) లో సభ్యురాలు. గాంధీ, గోపాలకృష్ణ గోఖలే, రవీంద్రనాథ్ టాగోర్, సరళాదేవి చౌదురానీ వంటి పెద్దలతో కలిసి సత్యాగ్రహాలు చేశారు. 1917లో సత్యాగ్రహ, అహింస ఉద్యమాలలో పాల్గొన్నారు.

1930లో ఉప్పు సత్యాగ్రహంలో అరెస్టు అయ్యారు.  యూపీ గవర్నర్‌గా మార్చి 1949లో నియమితులై 70 సంవత్సరాల వయసులో మరణించే వరకు బాధ్యతలు నిర్వహించారు. నిజానికి ఈమె జన్మ దినమైన ఫిబ్రవరి 13న మహిళా దినోత్సవం జరుగుతూ ఉండేది. ఆ చరిత్రను పూర్తిగా జనం మరిచిపోయారు.

సుచేతా కృపలానీ 

(25.06,1908- - 1.12.1974)

హర్యానా అంబాలా పట్టణంలో పుట్టారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని సత్యాగ్రహం చేశారు. అరెస్టయ్యారు. దేశ విభజన సమస్యల్లో బాధితులకు సాయం చేయడానికి గాంధీతో కలిసి పనిచేశారు. రాజ్యాంగ నిర్ణాయక సభకు కాన్పూర్ నుంచి ఎన్నికై ఛార్టర్ సబ్ కమిటీలో సభ్యురాలిగా చర్చలలో పాల్గొన్నారు.

1947 ఆగస్టు 14న ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ ప్రసంగానికి ముందు ‘వందేమాతరం’ గీతాన్ని పాడినారు.  All india Womens Conference (AIWC)లో సభ్యురాలు. 1969 కాంగ్రెస్ పార్టీ చీలిపోయినపుడు మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో ఎన్నికైనారు.

విజయలక్ష్మీ పండిత్ 

(18.08.1900 -- 1.12.1990)

అలహాబాద్‌లో జన్మించారు. మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ సోదరి ఆమె. 1932, 1940, 1942 సంవత్సరాలలో ఒక ఏడాది, మరోసారి రెండుసార్లు రెండేళ్లపాటు జైలుశిక్షకు గురయ్యారు.  అలహాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచిన తరువాత 1936లో యూపీ ఎన్నికలలో అసెంబ్లీకి విజయం సాధించి, క్యాబినెట్ మంత్రిపదవి నిర్వహించారు.

1944లో భర్త మరణించిన తరువాత ఆమె వితంతువులకు వారసత్వ హక్కుల గురించి పోరాడారు. All india Womens Conference (AIWC)లో ఉద్యమాలు చేసి హక్కుల చట్టాలను మార్చారు. 1946లో రాజ్యాంగ నిర్ణాయక సభలో యూపీ నుంచి ఎన్నికై చర్చలలో పాల్గొన్నారు. తరువాత సోవియట్ యూనియన్‌కు భారత రాయబార అధికారిగా, ఆ తరువాత మెక్సికో రాయబారిగా బాధ్యతలను స్వీకరించారు.

ముందు చిన్న దేశమైన ఐర్లాండ్‌లో ఇండియన్ హైకమిషనర్‌గా పనిచేశారు. తరువాత యుకె (United Kingdom) యూనియన్ కింగ్డమ్ ఇండియన్ హై కమిషనర్ అయినారు. (యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన నాలుగు దేశాలు: ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్). యూనియన్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మొదటి అధ్యక్షురాలైనారు. మధ్యలో మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేశారు. 1964లో పార్లమెంట్‌కు గెలిచారు.

ఆనీ మాస్కరీన్ 

(6.06.1902 -- 19.07.1963)

అక్కమ్మ చెరియన్, పట్టం థాను పిళ్లైతోపాటు మాస్కరీన్ చురుకుగా స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. సంస్థానాల విలీనం కోసం కృషి చేసిన నాయకులలో ఆమె ఒకరు. 1938 ఫిబ్రవరిలో ‘ట్రావెన్కోర్ స్టేట్ కాంగ్రెస్’ అనే రాజకీయ పార్టీ మొదటి మహిళ. మాస్కరీన్ కార్యవర్గ సభ్యురాలు.

సంస్థానం దివానుగా సర్ సీపీ రామస్వామి అయ్యర్ నియామకాన్ని రద్దు చేయాలని, ఆయన పరిపాలన, నియామకాలు, ఆర్థిక వ్యవహారాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ మహారాజా చితిర తిరునాల్‌కు మెమొరాండం పంపడంతో  కార్య నిర్వాహక కమిటీ చర్య తీసుకుంది. స్టేట్‌మెంట్ల కారణంగా ఓ పోలీసు అధికారి ఆమెపై దాడి చేశాడు.

ఆమె ఇంటిని పడగొట్టి, ఆస్తిని దోచుకెళ్ళారు. ఆమె ఈ ఘటనపై కథనాన్ని ప్రచురించి, పోలీసుల ఆగ్రహానికి గురైనారు. అనేకసార్లు అరెస్టయ్యారు. జైలుశిక్షలు అనుభవించారు. రాష్ట్ర శాసనసభలో ఆమె శక్తివంతమైన వక్త. 1942లో మాస్కరీన్ ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో చేరారు. రెండు సంవత్సరాల తరువాత ట్రావెన్కోర్ స్టేట్ కాంగ్రెసు పార్టీకి కార్యదర్శిగా ఎన్నికైనారు.

1946లో భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు ఏర్పరచిన 299 మంది సభ్యుల రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికైనారు.  హిందూ కోడ్ బిల్లును పరిశీలించే అసెంబ్లీ ఎంపిక కమిటీలో ఆమె పనిచేశారు. భారత స్వాతంత్య్ర చట్టం-1947ను బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించాక, ఆగస్టు 15న ఈ రాజ్యాంగ సభే పార్లమెంటుగా మారింది.

1948లో ఆమె ట్రావెన్కోర్- కొచ్చిన్ శాసనసభకు తిరిగి ఎన్నికైనారు. 1952 వరకు పనిచేశారు. 1949లో స్వాతంత్య్రానంతరం రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన మొదటి మహిళ ఆమె. మాస్కరీన్ 1952 ఎన్నికల్లో తిరువనంతపురం లోక్‌సభ నియోజక వర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా మొదటి లోక్‌సభకు ఎన్నికైనారు.