03-05-2025 01:07:55 PM
వడగాలులకు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): జిల్లాలో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నందున, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వడ దెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్(District Collector Jitesh V Patil) శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎండల్లో బయట తిరగకుండా జాగ్రత్త వహించాలని, అత్యవసర పరిస్థితి అయితే తప్ప ప్రజలు బయటికి రావద్దని, మద్యాహ్నం 12 గంటల నుండి 4 గంటల మద్యలో ఎట్టి పరిస్థితులలో ఇండ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు తెలిపారు. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో వడ దెబ్బలు, ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వివరించారు. వడదెబ్బ తగిలిన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఎండాకాలంలో నిలిపి ఉన్న వాహనాలలో పిల్లలు పెంపుడు జంతువులను వదల వద్దని, మధ్యాహ్నం ఆల్కహాల్ ,టీ, కాఫీ, స్వీట్స్ చల్లని డ్రింక్స్ తీసుకోవద్దని, చెప్పులు లేకుండా బయట నడవవద్దని అన్నారు. చిన్నారులు, వయోవృద్దులు ఇంటికే పరిమితం కావాలని, ప్రతి రోజు సరిపడ నీరు తీసుకోవాలని, వదులుగా ఉన్న దుస్తువులను ధరించాలని, బయటికి వెళ్ళేటప్పడు గొడుగు లేదా టోపిని దరించాలని, ద్వి చక్రవాహానాలపై సుదూర ప్రయాణాలు చేయకూడదన్నారు. అలాగే ఎండలో పనిచేసే కార్మికులు తరచుగా నీటీతో పాటు ఓ.ఆర్.ఎస్. ద్రావణాన్ని తీసుకోవాలని తద్వారా వడదెబ్బ నుండి శరీరాన్ని కాపాడు కోవచ్చన్నారు. అధిక శరీర ఉష్ణోగ్రత, అలసట, నోరు ఎండి పోవడం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే సమీప ప్రభుత్వ ఆసుపత్రులలో సంప్రదించి, 108 కు ఫోన్ చేసి చికిత్స, అవసరమైన మందులు పొందాలన్నారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకొని ఈ వేసవి కాలంలో జాగ్రత్తలు పాటిస్తూ, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కలెక్టర్ కోరారు.