calender_icon.png 4 May, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యుద్ధానికి విరామం

28-11-2024 12:00:00 AM

ఏడాదికి పైగా యుద్ధంతో నలిగిపోతున్న పశ్చిమాసియాలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్‌హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. 60 రోజులపాటు కొనసాగే ఈ విరమణ ఒప్పందానికి మంగళవారం ఇజ్రాయెల్ భద్రతా వ్యవహారాల క్యాబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారంనుంచి ఈ కాల్పుల విరమణ అమలులోకి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్  స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు.

తాను ఇజ్రాయెల్, లెబనాన్ ప్రధానులతో మాట్లాడానని ఆయన చెప్పారు. టెల్ అవీవ్, హెజ్‌బొల్లా మధ్య విధ్వసకర ఉద్రిక్తతలకు ముగింపు పలకడానికి అమెరికా చేసిన ప్రతిపాదనకు ఇరువురూ అంగీకరించడం సంతోషకరమైన విషయమని చెప్పారు. ఈ ఒప్పందం శాశ్వతంగా ఉండాలని ఆకాంక్షించారు. అంతేకా దు గాజాలో కాల్పుల విరమణకు ఇదొక కీలక మైలురాయి అవుతుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.

హమాస్ చెరలో ఉన్న  ఇజ్రాయెల్ బందీలను విడించే దిశగా తమ కృషి కొనసాగుతుందని, టర్కీ, ఈజిప్టు, ఖతార్ దేశాల నాయకులతో చర్చలు జరుపుతామని కూడా బైడెన్ స్పష్టం చే శారు. అటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా కాల్పుల విరమణపై స్పందించారు. ఒప్పందం ఎన్ని రోజులు ఉంటుందనేది లెబనాన్‌పై ఆధారపడి ఉంటుందని అన్నారు. ఒప్పందం ఉల్లంఘన జరిగితే మాత్రం తా ము తీవ్రంగా స్పందిస్తామని కూడా స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఒప్పందంపై ఐక్యరాజ్య సమితి, భారత్ సహా పలు ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేశాయి.

ఒప్పందం ప్రకారం 60 రోజుల వ్యవధిలో ఇజ్రాయెల్ క్రమంగా తన బలగాలను ఉపసంహరించుకుని లెబనాన్ బలగాలు, ఐక్యరాజ్య సమితి శాంతిదళాలు సరిహద్దు భూభాగాన్ని తమ నియంత్రణలోకి తీసుకుంటాయి. అయితే ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరించడానికి మూడు ప్రధాన కారణాలున్నాయని నెతన్యాహు చెప్పడం గమనార్హం. తమ సైనికుల రక్షణ, హమాస్‌ను ఒంటరి చేయడం ముఖ్య ఉద్దేశంగా చెప్పారు. అయితే ఇరాన్‌పై మరింత దృష్టి సారించడం ఈ కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించడానికి మరో కారణమని తెలుస్తోంది.

గత ఏడాది కాలంగా ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో లెబనాన్ కూడా తీవ్రంగా దెబ్బతిన్నది. ఇజ్రాయెల్ దాడుల్లో 12 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇజ్రాయెల్‌హెజ్‌బొల్లా పోరులో 3,700 మంది ప్రాణాలు కోల్పోగా వీరిలో అత్యధికులు పౌరులే. 14 నెలల క్రితం ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం మొదలైన తొలినాళ్లనుంచే హెజ్‌బొల్లా హమాస్‌కు అండగా నిలిచింది.

అయితే ఇజ్రాయెల్ దాడుల్లో ఈ రెండు గ్రూపులకు చెందిన పలువురు ప్రముఖ నేతలు నేలకొరిగారు. హసన్ నస్రల్లా, యాహ్యా సిన్వర్, ఇస్మాయిల్ హనియె, సమీ తాలెబ్ అబ్దుల్లా వంటి పలువురు సీనియర్ కమాండర్లు హతమయ్యారు. రోజురోజుకు యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుంది. కాల్పుల విరమణ ఒప్పందాలను ప్రకటించింది. ఐరాస భద్రతా మండలి 1701 తీర్మానాన్ని ఆమోదించింది.

దీనిపై ఇజ్రాయెల్, లెబనాన్‌తో శాంతి కుదిర్చే బాధ్యతను అమెరికా, ఫ్రాన్స్ తీసుకున్నాయి. శాం తియుత వాతావరణం నెలకొనడానికి మధ్యవర్తిత్వం నెరిపాయి. ఇరుదేశాల ప్రతినిధులతో శాంతి చర్చలు జరిపాయి. రెండు వారాలుగా జరు గుతున్న చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. కాల్పుల విరమణకు ఇరుపక్షాలు ఎట్టకేలకు అంగీకరించాయి.

కొత్త సంవత్సరంలో అమెరికా అధ్యక్ష బాధ్యతలనుంచి తప్పుకోనున్న జో బైడెన్ పోతూపోతూ ఓ మంచి పని చేశారని ఇప్పుడు ప్రపంచ దేశాల నేతలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనవరి 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా ట్రంప్ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు ఎలా మారుతాయోన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేప థ్యంలో పశ్చిమాసియాలో శాంతిరేఖలు పొడసూపడం మంచి పరిణామ మే. హమాస్ కూడా దారికి వచ్చి కాల్పుల విరమణకు అంగీకరిస్తే గాజా పౌరులు క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను సంతోషంగా జరుపుకొనే అవకాశం లభిస్తుంది. ఆ దిశగా ప్రయత్నాలు ఫలిస్తాయని ఆశిద్దాం.