calender_icon.png 20 December, 2025 | 1:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటును అమ్ముకోవద్దు!

09-12-2025 12:00:00 AM

గడగోజు రవీంద్రాచారి :

గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పునాది. కానీ నేటి పరిస్థితులు చూసుకుంటే పదవి కాదు ముఖ్యం.. పైసలే ప్రతిష్ఠ అన్నట్టుగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఒకప్పుడు సర్పంచ్ పదవి.. సేవకు ప్రతీక. కానీ నేడు అది దందాకు, దౌర్జన్యానికి ద్వారంగా మారిపోయింది. ఓటు అనేది మంచి పాలన అం దించే నాయకున్ని ఎన్నుకునేందుకు రాజ్యాంగం మనకు హక్కుగా కల్పించింది.

అయితే ఇప్పుడు అదే ఓటు.. ధరకు అమ్మే వస్తువుగా మారిపోయిన దుస్థితి ఏర్పడింది. తాజాగా పంచాయతీ ఎన్నికల సందర్భంగా.. ఎక్కడ చూసినా డబ్బు, మద్యం, ప్రలోభాల పండుగే కనిపి స్తున్నది. ఓటరును ఓటరుగా కాకుండా ఏం ఇస్తే ఓటు వేస్తాడు? అన్న లెక్కలోనే అభ్యర్థులు చూస్తున్నారు. 500 రూపాయల కోసం ఓటు అమ్మేసిన ప్రజలు, అనంతరం ఆ ఐదు సంవత్సరాలు బాధలను కొని తెచ్చు కుంటున్నారు.

చేతిలో పెట్టిన కొత్త నోటు.. ఐదేళ్ల అప్పుల బాకీగా మారిపోయే రోజులు ఇవి. సర్పంచ్ పోటీలో ఉన్న అభ్యరుల్లో చాలా మంది పదవికి కాదు.. పదవి ద్వారా వచ్చే లాభాలకు పోటీ పడుతున్నారు. లక్షల్లో ఖర్చు పెట్టి పదవి కొని తెచ్చుకునే వాళ్లు, ఆ డబ్బు తిరిగి ఎలా వస్తుందో ప్రజలకు తెలియదా? అనేది గమనించాలి. డబ్బుతో కొన్న పదవి.. చివరికి ప్రజల మీదే వడ్డీతోనే వసూలవుతుందన్నది వాస్తవం. కానీ ఈ అవగాహనలోనే పెద్ద లోటు ఉంది.

ప్రజలు తీసుకునే డబ్బు, కోల్పోయే హక్కు మధ్య తేడా గ్రహించడం లేదు. సమస్య వచ్చినప్పుడు నాయకుడిని నిలదీయడానికి నైతిక బలం ఉండాలంటే ఓటును అమ్ముకోవద్దు. దానం తీసుకున్న చేతి.. ఎన్నటికీ ధర్మం అడగలేదు అన్న మాటను గుర్తుంచుకోవాలి. గ్రామాల్లో నేడు పరిస్థితి ఏమిటి? ఎవరు ఎక్కడివారైనా సరే పైసలు ఇచ్చినవాడే నాయకుడు అన్న తరహాలో మార్పు రూపాంతరం చెందింది.

ప్రజలు కూడా తమకు డబ్బులు ఇచ్చినవాడినే చూసి ఓటు వేస్తే.. ఇక అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుందనేది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. రూపా యి కోసం హక్కును అమ్మితే.. ఐదేళ్లు అభివృద్ధి అనేది అద్దెకు కూడా రాదు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేది ఓటు హక్కు. ఆ హక్కును స్వేచ్ఛగా వినియోగించకపోతే ప్రజాస్వామ్యం కాగితపు పులిలా మారిపోతుంది. ఎన్నికలు అనేవి మార్కెట్ కాదు.. అది నాయకత్వానికి న్యాయస్థానమన్న విషయం గ్రహించాలి.

డబ్బు కాదు.. ధర్మం గెలవాలి అనే విషయం గు ర్తుంచుకోవాలి. సామర్థ్యం ఉన్నవాడే ఎన్నికల బరిలో నిలవాలి. ఓటు వేసేముందు ప్రజలు తమ నాయకుడి ఎన్నికపై ఒక్కసారి ఆలోచించుకో వాల్సిన అవసరముంది. పైసలతో పుట్టిన నాయకుడు.. ప్రజల సమస్యలు పరిష్కరించే నాయకుడా? లేక తిరిగి పైసలు వసూలు చేసుకునే వ్యాపారా అన్న విషయం అవగతవమవుతుంది.

గ్రామ పాలన అంటే ప్రజల బలం, ప్రజల నమ్మకం, ప్రజల సంక్షేమం. ఆ బలాన్ని నోటుకు అమ్ముకోవద్దు. ఓటు హక్కు అమ్మినవాడే  తన గ్రామ భవిష్యత్తును వేలం వేసిన వ్యక్తిగా అప్రతిష్ఠను మూటగట్టుకుంటాడు. ప్రలోభాలను తిరస్కరించి స్వేచ్ఛగా, ధైర్యంగా, నిజాయితీగా ఓటు వేయండి. అప్పుడే  గ్రామానికి నిజమైన సర్పంచ్ రావడంతో అభివృద్ధి సాధ్యపడుతుంది. మంచి నాయకుడి ఎన్నికతో ప్రజాస్వామ్యం కూడా నిలబడినట్లవుతుంది.

 వ్యాసకర్త సెల్: 9848772232