calender_icon.png 20 December, 2025 | 11:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూపాయి పతనం!

09-12-2025 12:00:00 AM

‘రూపాయి విలువ పడిపోతోంది’ ఈ మాటను తరచూ వింటూనే ఉంటాం. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న సమస్యలు, ఇతర కారణాల వల్ల రూపాయి విలువ రోజు రోజుకు క్షీణిస్తున్నది. గత బుధవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.90 మార్క్‌ను దాటింది. దేశ చరిత్రలో రూపాయి విలువ ఇంత కనిష్ఠానికి పడిపోవడం ఇదే తొలిసారి. సోమవారం నాటికి రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ. 90.15గా ఉంది. రాబోయే రోజుల్లో ఇది మరింత కనిష్ఠానికి చేరే అవకాశముందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

1947లో భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పుడు రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.3.30గా ఉండేది. 2000 సంవత్సరంలో రూ.44.94 గా ఉన్న విలువ.. 25 ఏళ్లలో 90 మార్క్‌ను దాటేసింది. రూపాయి పతనానికి కారణాలు అనేకం. భారత్, అమెరికా దేశాల మధ్య వాణిజ్య చర్చల్లో ప్రతిష్ఠంభన కొనసాగడం మార్కెట్‌లో అనిశ్చితిని పెంచింది. రెండు దేశాలు ట్రేడ్‌డీల్‌కు దగ్గర్లో ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నప్పటికీ ఆ దిశగా అడుగులు మాత్రం పడలేదు.

అమెరికాలో ప్రస్తుతం ద్రవ్యోల్పణం కొనసాగుతున్న కారణంగా దీనిని నియంత్రించేందుకు అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ అనూహ్యంగా వడ్డీ రేట్లను పెంచడంతో అమెరికాలో పెట్టుబడులు లాభదాయకంగా మారిపోయాయి. దీంతో విదేశీ పెట్టుబడిదారులు భారత స్టాక్ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను భారీ మొత్తంలో ఉపసంహరించుకుంటుండడంతో ఆ ప్రభావం రూపాయిపై పడుతోంది. ఇటీవల ట్రంప్ భారత్‌పై సుంకాలను 50 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే.

దీనివల్ల అమెరికాకు ఎగుమతయ్యే స్వదేశీ వస్తువులు అక్కడ ఖరీదుగా మారడంతో వాటికి డిమాండ్ తగ్గుతోం ది. ఫలితంగా అమెరికాకు మన ఎగుమతులు తగ్గడంతో భారత్‌కు వచ్చే డాల ర్ల ప్రవాహం తగ్గిపోయింది. భారత్ ఇంధన అవసరాల కోసం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోంది. ప్రస్తుతం ముడి చమురు ధరలు అంత ర్జాతీయ మార్కెట్లో పెరిగిపోవడంతో భారత్ గతంలో కంటే ఎక్కువ డాలర్లు పెట్టి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

చమురుతో పాటు ఎలక్ట్రానిక్స్, ఎరువులు, వంట నూనెల కోసం కూడా విదేశీపైనే ఆధారపడు తున్నాం. భారత్ నుంచి అధిక మొత్తంలో డాలర్లు బయటికి వెళ్లిపోవడంతో రూపాయి బలహీనపడి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు మరింత పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో రూపాయి విలువ పడిపోవడం ప్రతికూలం కాదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ పరిస్థితులు దేశంలోని ఎగుమతుదారులకు ప్రయోజనకరమన్నారు.

రూపాయి కనిష్ఠ స్థాయి కి చేరుకోవడంతో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించి కాస్త ఉపశమనం కలిగించింది. అయితే రూపాయి బలపడాలంటే దేశాభివృద్ధికి దోహదపడే వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలకు ప్రాధాన్యమివ్వాలి. విదేశీ కంపెనీలు దేశంలో నేరుగా తమ వ్యాపారాలు, సంస్థలు స్థాపించుకునేందుకు విధానాలను సులభతరం చేయాలి. దీనివల్ల విదేశీ పెట్టుబడులు పెరిగి దేశానికి డాలర్లను తీసుకొస్తాయి.

రూపాయి విలువ పడిపోకుండా ఉండేందుకు చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రాయితీలు ఇచ్చి ఉత్పత్తులను పెంచాలి. విద్య, వైద్యంతో పాటు అనేక సేవా రంగాలను ప్రభుత్వమే మెరుగ్గా నిర్వహించాలి. మన దేశం నుంచి ఎగుమతులు పెంచగలిగితే విదేశీ మారక నిల్వలు పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండి రూపాయి బలపడే అవకాశముంది.