08-12-2025 01:50:44 AM
2024 25 సంవత్సరం తెలంగాణ సాహిత్య అకాడమీకి మైలురాయి. ఒకవైపు సాహిత్య సృజనకు సరైన దిశనిచ్చి, గ్రామీణ ప్రతిభను వెలిగిస్తూనే, మరోవైపు యువతను సాహిత్యం వైపునకు ఆకర్షించి పరిశోధనలకు పునాది వేసిన కీలక సంవత్సరం. ఈ సంవత్సరపు కార్యక్రమాలు రాష్ట్ర సాహిత్య చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించాయి. నూతన ప్రభుత్వం పూర్తి చేసుకున్న రెండేళ్లలో అకాడమీ 100కు పైగా కార్యక్రమాలు నిర్వహించింది.
తద్వారా తెలంగాణ సమాజంలో సాహితీ దివిటీలను వెలిగించింది. కవి సమ్మేళనాలు, కథా వర్క్ షాపులు, రచయితల గోష్ఠులు, చర్చలు, సభలు, పుస్తకావిష్కరణలు.. ఇలా ప్రతీ కార్యక్రమం ప్రజల్లో సాహిత్యంపై ఆసక్తిని పెంపొందించే దిశగా కొనసాగింది. దీనిలో భాగంగానే అకడామీ ‘పునాస’ పేరుతో ప్రత్యేక సంచికలు వెలువరించింది. దాశరథి, బిరుదురాజు రామరాజు వెలువడిన ఈ రెండు ప్రత్యేక సంచికలు నేటి తరానికి దిక్సూచిగా నిలిచాయి.
వారి శతజయంతుల సందర్భంగా నివాళి అర్పించినట్లయింది. సంచికలు ఆ సాహితీవేత్తల జీవితాలు, రచనా ప్రస్థానం, వారి సామాజిక సేవలను సమగ్రంగా పరిచయం చేశాయి. సంచికలు ప్రభుత్వం సాహిత్యభివృద్ధిపై సారించిన చొరవకు తార్కాణం. అకాడమీపై పెట్టిన బాధ్యతను విస్మరించకుండా మరింత విస్తృతమైన, సృజనాత్మకమైన పనులను గత రెండేళ్లుగా చేపట్టి సాహిత్య ప్రవాహానికి కొత్త దిశను చూపింది.
సాహిత్యవారం..
అకాడమీ ప్రతి నెలా ఒకటి, మూడో శనివారాలను ‘సాహిత్యవారం’గా ప్రకటించింది. తద్వారా సాహితీవేత్తలకు అకాడమీని దగ్గర చేసే ప్రయత్నాన్ని సాహితీ ప్రపంచం హర్షించింది. గతేడాది డిసెంబర్ నుంచి మొదలైన ఈ కార్యక్రమం నిరఘాటంగా కొనసాగుతూ సాహితీ వేత్తల పుస్తక ఆవిష్కరణకు మార్గం సుగమం అయింది. ఆవిష్కరణలకు ప్రసంగాలకు వేదిక సమస్య తీరిపోయింది.
సాహిత్యవారం కార్యక్రమంలో సాహితీవేత్తలు తాము రచించిన పుస్తకాలను ఆవిష్కరణ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు సాహిత్య అకాడమీ చేస్తుంది. ఇప్పటివరకు అకాడమీ 50కి పైగా పుస్తకాలను ఆవిష్కరించింది.
ఈ ఏడాది నిర్వహించిన యువకవుల పోటీలు, కాలేజీ వర్క్‌షాప్‌లు అకాడమీ లక్ష్యాన్ని స్పష్టంగా తెలియజేశాయి. శతాబ్దాలుగా తెలంగాణలో ఉన్న కథా రచయితల లోటును పూరించే దిశగా అకాడమీ కథా రచనలో నూతన కథకులకు కథ నిర్మాణ పద్ధతులు, కథ వస్తువు ఎంపిక లాంటి అంశాలతో కథ కార్యశాల నిర్వహించింది. కథకులు పెద్దింటి అశోక్‌కుమార్, వెల్దండి శ్రీధర్ మెళకువలు నేర్పించారు.
పుస్తక ప్రచురణలు
నేటి తరానికి అవసరమైన మరియు పాఠకుల నుంచి వస్తున్న విన్నపాలను పరిగణనలోకి తీసుకొని కొన్ని పుస్తకాలను అకాడమీ ముద్రించింది. సాంస్కృతిక పదకోశం, సాహిత్య అనువాదంలో సమస్యలు, నిప్పు పూలు, కాళోజీ కథలు, చంద్రభాగ, అంతర్జాలంలో భాషా సాహిత్యాలు, సాహిత్య గ్రంథ సూచి, దాశరథి పద్యవీణ, దాశరథి సాహిత్య పరిమళం వంటి విశిష్ట గ్రంథాల ప్రచురణ చేపట్టింది.
గడిచిన తరాల సాహిత్య వారసత్వాన్ని గుర్తు చేస్తూ కొత్త తరాలకు చరిత్ర పాఠమై నిలవాలని తెలంగాణ వైతాళికుల జయంతులు, వర్థంతులు, జ్ఞాపకోత్సవాలు నిర్వహించింది. సంస్కృతీ పరిరక్షణకు అద్దం పట్టే ఈ కార్యక్రమాల ద్వారా తెలంగాణ సాహిత్య గొప్పదనం ప్రజల్లోకి చేరింది. ఈ ఏడాది అత్యధిక స్పందన పొందిన కార్యక్రమాల్లో యువకవుల వేదిక ఒకటి. యువ కవులు తమ రచనల ద్వారా కొత్త శైలిని సాహిత్యలోకానికి పరిచయం చేశారు. వీరి కవితలు, సాహిత్య వ్యాసాలు, కథలను ‘పునాస’లో ప్రచురిస్తూ వారిని అకాడమీ ప్రోత్సహించింది.
తెలంగాణ ప్రాంత కవులు, రచయితల గ్రంథాల వివరాలను 2018 వరకు గ్రంథస్తం చేసింది. సుమారు 16 వేలకు పైగా గ్రంథాల వివరాలు సేకరించి ‘తెలంగాణ సాహిత్య గ్రంథ సూచి’ ప్రచురించి పరిశోధక విద్యార్థులకు ఒక దిక్సూచి అయింది. అలాగే రాష్ట్ర పండుగలు, జాతరల సాంస్కృతిక పదకోశాన్ని ప్రచురించి, గ్రామీణ పండుగల విశిష్టతను ప్రజలకు తెలియజేసింది. బతుకమ్మ పండగ , కాళోజీ జయంతి, సినారె, దాశరథిని గుర్తుచేసుకుంటూ అనేక కవి సమ్మేళనాలు నిర్వహించింది. కాళోజీ, దాశరథి అవార్డులతో ప్రభుత్వం కవులను, రచయితలను గౌరవిస్తున్నది.
దీనిలో భాగంగా తొలిసారిగా మహిళా సాహితీవేత్త నెల్లుట్ల రమాదేవికి కాళోజీ పురస్కార ప్రదానం చేసింది. అలాగే నేటి బాలబాలికలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో అకాడమీ బాల సాహిత్యాన్ని రెండు సంవత్సరాలుగా అకాడమీ ప్రోత్సహిస్తోంది. నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా బడి పిల్లలకు కవిత్వం, కథ, నాటిక, పద్యాల పోటీలు నిర్వహించింది.
వ్యాసకర్త సెల్: 90631 31999 కార్యదర్శి, తెలంగాణ సాహిత్య అకాడమీ