22-01-2026 05:52:07 PM
బెల్టు షాపులకు ఫుల్లు.
బెల్టు షాపులకు వైన్స్ డోర్ డెలివరీ.
మరిపెడ జనవరి 22(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో మద్యం విక్రయాలు నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా సాగుతున్నాయి. మద్యం దుకాణాల నిర్వాహకులు నిబంధనలను తుంగలో తొక్కి, లాభార్జనే ధ్యేయంగా నేరుగా గ్రామాలకే మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. వైన్స్ షాపుల నుండే వాహనాల్లో లోడ్ చేసుకొని వెళ్లి, గ్రామాల్లోని బెల్టు షాపులకు డోర్ డెలివరీ ఇస్తుండటం గమనార్హం. సాధారణంగా మద్యం దుకాణం నుండి కౌంటర్ ద్వారా మాత్రమే విక్రయాలు జరగాలి. కానీ మరిపెడలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.
నిర్వాహకులు అత్యుత్సాహంతో ఊరూరా తిరిగి బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్నారు. గ్రామాల్లో మద్యం ప్రవాహం పెరుగుతున్నా, ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.గుడుంబాపై గర్జన.. వైన్స్‌పై మౌనం? గ్రామాల్లో గుడుంబా తయారీ కేంద్రాలపై మెరుపు దాడులు చేస్తూ ఆర్భాటం చేసే ఎక్సైజ్ అధికారులు, పట్టపగలే వైన్స్ షాపుల నుండి గ్రామాలకు తరలుతున్న మద్యాన్ని ఎందుకు అడ్డుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వైన్స్ వాహనాలు నేరుగా గ్రామాల్లోకి వెళ్లడం చట్టరీత్యా నేరం. డోర్ డెలివరీ వల్ల ఊర్లలో బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.ఇదంతా ఎక్సైజ్ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగక ముందే ఉన్నతాధికారులు స్పందించాలని మండల ప్రజలు కోరుతున్నారు. వెంటనే ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టి, అక్రమంగా మద్యం తరలిస్తున్న వైన్స్ షాపుల లైసెన్సులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు