calender_icon.png 22 December, 2025 | 1:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డోపింగ్ పరేషాన్!

20-12-2025 12:00:00 AM

ఒకపక్క క్రీడల్లో అన్ని రంగాల్లో సమష్టి ప్రదర్శన కనబరుస్తూ పతకాలు కొల్లగొడుతున్న భారత్- విశ్వ వేదికపై మువ్వన్నెల జెండా ను రెపరెపలాడిస్తుంది. 2030 కామన్‌వెల్త్ గేమ్స్ నిర్వహణకు ఇప్పటికే హక్కులు సాధించిన భారత్.. 2036లో జరగనున్న ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ నిర్వహణ కోసం బిడ్ వేయాలనే యోచనలో ఉంది. కానీ మరోపక్క డోపింగ్‌లో పట్టుబడుతున్న భారత క్రీడాకారుల సంఖ్య నానాటికి పెరిగిపోతుండడం కలవరపెడుతోంది.

ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) తాజాగా వెల్లడించిన నివేదిక ప్రకారం.. డోపీలు అధికంగా ఉన్న దేశంగా భారత్ వరుసగా మూడో ఏడాది కూడా అగ్రస్థానంలో నిలిచి అప్రతిష్టను మూటగట్టుకుంది. జాతీయ నిరోధక సంస్థ (నాడా) గతేడాది 7,113 మూత్ర, రక్త నమూనాలను పరిశీలిస్తే అందులో 260 మంది క్రీడాకారులు పాజిటివ్‌గా తేలారు. మొత్తం నమూనాల్లో ఇది 3.6 శాతం కావ డం గమనార్హం. 2023లో 213 మంది, 2022లో 125 మంది డోపింగ్ లో పాజిటివ్‌గా తేలడం గమనార్హం.

మన పొరుగున ఉన్న చైనాలో 24 వేలకు పైగా శాంపిళ్లు పరీక్షిస్తే 43 మాత్రమే పాజిటివ్‌గా తేలాయి. ఫ్రాన్స్, రష్యా, జర్మనీ వంటి దేశాలు పది వేలకు పైగా నమూనాలను పరీక్షించినప్పటికీ ఆ దేశాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య వంద కూడా దాటడం లేదు. భారత్‌లో తక్కువ మోతాదులో శాంపిళ్లు పరిశీలించినప్పటికీ అధిక సంఖ్యలో పట్టుబడుతుండడం చూస్తే క్రీడావ్యవస్థ దారి తప్పుతున్నట్లుగా అనిపిస్తున్నది. దేశీయంగా గడిచిన నాలుగేళ్లలో 640 మంది డోపింగ్ టెస్టుల్లో విఫలమయ్యారు.

అందులో రెండొందల మంది అథ్లెటిక్స్ విభాగానికి చెందినవారే ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో వెయిట్ లిఫ్టింగ్, రెజ్లిం గ్, పవర్ లిఫ్టింగ్, బాక్సింగ్ క్రీడాకారులున్నారు. కొందరు తెలిసీ తెలియక వాడుతున్న ఔషధాల మూలంగా డోపింగ్ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. మరికొందరు మాత్రం గెలవాలన్న దురాశతో తప్పు అని తెలిసినప్పటికీ యథేచ్చగా నిషేధిత ఉత్ప్రేరకాలు వాడుతూ దొరికిపోతున్నారు. భారత్‌లో పాఠశాల, కళాశాల స్థాయిలోనూ క్రీడా పోటీల్లో పాల్గొనే విద్యార్థులు డోపింగ్‌లో పట్టుబడుతుండడం కలవరపెట్టే అంశం.

ఇటీవలే ఢిల్లీలో ఒక పాఠశాలలోని టాయిలెట్ గదుల ఆవరణలో వందల సంఖ్యలో వాడి పడేసిన సిరంజీలు లభ్యమవడం తీవ్రతను తెలియజేస్తుంది. అంతేకాదు ఢిల్లీ లో ఇంటర్ స్థాయిలో నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనడానికి వచ్చి న ఒక విద్యార్థి రేస్ ఎండ్ పాయింట్ వద్ద డోపింగ్ అధికారులను చూసి కళాశాల గోడ దూకి పారిపోవడం గమనార్హం. అయితే క్రీడల్లో అనైతిక ధోరణుల నివారణకు కేంద్రం 2022లోనే ప్రత్యేక చట్టం తెచ్చింది.

అయినప్పటికీ డోపింగ్ భూతం జడలు విప్పుతూనే ఉంది. డోపింగ్‌కు అడ్డుకట్ట వేయకపోతే రష్యా మాదిరిగా భారత్ కూడా అంతర్జాతీయ క్రీడా ప్రపంచంలో ఏకాకి అయ్యే అవకాశముంది. అడ్డదారుల్లో పతకాలు సాధించా లనుకునే క్రీడాకారులకు చెక్ పెట్టేందుకు కేంద్రం తెచ్చిన యాంటీ డోపింగ్ సవరణ బిల్లు గత ఆగస్టులో పార్లమెంటు ఆమోదం పొందింది.  ఈ చట్టం అమలుకు నోచుకుంటే మెరుగైన ఫలితాలు సిద్ధిస్తాయి. దీంతో పాటు డోపింగ్ పర్యవసానాలపై క్రీడాలోకానికి విస్తృత అవగాహన కల్పించాలి. ఆరోగ్య చికిత్సలో భాగంగా క్రీడాకారులకు తీసుకోకూడని మందుల జాబితాను వివరించాల్సిన అవసరముంది.