31 March, 2026 | 7:32 PM

దుండిగల్-గండిమైసమ్మలో హైడ్రా ఆపరేషన్

31-03-2026 06:23 PM

150 ఫీట్ల రహదారిపై షాపుల దందాకు చెక్

హైడ్రా చర్యలకు స్థానికుల అభినందనలు

కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్–గండిమైసమ్మ మండలం పరిధిలో హైడ్రా ఆపరేషన్ నిర్వహించింది. బౌరంపేట్ గ్రామ పరిధిలోని గండిమైసమ్మ–మియాపూర్ ప్రధాన రహదారిపై అక్రమంగా నిర్మించిన షాపుల‌ను హైడ్రా మంగ‌ళ‌వారం తొల‌గించింది. 150 అడుగుల ప్ర‌ధాన ర‌హ‌దారికి ఇరువైపులా ఓ వ్య‌క్తి ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డి తాత్కాలిక షెడ్డులు వేసి అద్దెల‌కు నడుపుతున్నారని హైడ్రాకు ఫిర్యాదులు అందాయి.

ఫిర్యాదుల‌ను హైడ్రా క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించింది.  ఆక్ర‌మ‌ణ‌ల‌తో ర‌హ‌దారిపై ట్రాఫిక్ ఇబ్బందులు క‌లుగుతున్నాయ‌ని గుర్తించింది. ఇందులో స్క్రాప్ దుకాణాలు, ఇత‌ర షాపుల వాళ్ల‌కు రెండు నెల‌ల ముందే ఖాళీ చేయాల‌ని సూచించిన హైడ్రా రహదారిని ఆనుకుని నిర్మించిన 10 షాపులను తొల‌గించింది. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు తొల‌గిన‌ట్ట‌య్యిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. హైడ్రా అధికారుల చర్యలను అభినందిస్తూ, రహదారిని విముక్తి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.