11 March, 2026 | 6:12 AM

డాక్టర్ నమ్రత ఆస్తులు సీజ్

11-03-2026 01:17 AM
  1. నమ్రత, ఆమె కుమారుల పేరిట ఉన్న 50 స్థిరాస్తులను జప్తు చేసిన ఈడీ 

వీటి రిజిస్ట్రేషన్ విలువ రూ.29.76 కోట్లు

ప్రస్తుత మార్కెట్ విలువ రూ.50 కోట్లు

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 10 (విజయక్రాంతి): నకిలీ సరోగసీ, పసికందుల విక్రయాల దందాకు తెరతీసిన యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ నిర్వాహుకురాలు డాక్టర్ పాచిపల్లి నమ్రత అట్లూరి నమ్రత, ఆమె కుమారులకు చెందిన సుమారు రూ.50 కోట్ల విలువైన 50 స్థిరాస్తులను ఈడీ హైదరాబాద్ జోనల్ ఆఫీస్ అధికారులు తాత్కాలికంగా జప్తు చేశారు.

హైదరాబాద్‌లోని గోపాలపురం పోలీస్ స్టేషన్‌లో డాక్టర్ నమ్రతపై మోసం, నేరపూరిత కుట్ర, చట్టవిరుద్ధమైన సరోగసీ, పిల్లల అక్ర మ రవాణా తదితర తీవ్రమైన ఆరోపణలతో గతంలో పలు ఎఫ్‌ఐఆర్లు నమోదయ్యాయి. ఈ కేసుల ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ.. పీఎంఎల్‌ఏ చట్టం కింద లోతైన దర్యా ప్తు చేపట్టి  వాస్తవాలను వెలుగులోకి తెచ్చిం ది. డాక్టర్ నమ్రత తన క్లినిక్ ఉద్యోగులు, ఏజెంట్లతో కలిసి ఓ భారీ ముఠాను ఏర్పా టు చేసి, అద్దెగర్భం పేరుతో దారుణాలకు ఒడిగట్టినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది.

సరోగసీ పేరుతో పక్కా మోసం

సంతానం లేని దంపతులకు సరోగసీ ద్వారా పిల్లలను ఇస్తామని నమ్మించి, వారి నుంచి డాక్టర్ నమ్రత భారీగా డబ్బులు వసూలు చేసింది. ఈ తతంగాన్ని చట్టబద్ధంగా, సహజంగా జరుగుతున్నట్లు నమ్మిం చేందుకు దంపతుల నుంచి అండాలు, వీర్యకణాలను సేకరించి నాటకం ఆడేది. కానీ, వాస్తవానికి వీరు సరోగసీ పద్ధతిని వాడలేదు. పిల్లలను పెంచే స్థోమత లేని, లేదా అబార్షన్ చేసుకోవాలనుకునే నిరుపేద, నిస్సహాయ గర్భిణులను ఈ ముఠా లక్ష్యం చేసేది. ఏజెంట్లు, సబ్‌ఏజెంట్ల నెట్వర్క్ ద్వా రా ఆ నిరుపేద గర్భిణులకు డబ్బు ఆశచూపి బిడ్డ పుట్టగానే ఆ పిల్లలను కొనుగోలు చేసేవారు.

ఇలా కొన్న పిల్లలనే సరోగసీ ద్వారా పుట్టారని చెప్పి సంతానలేమి దంపతులకు అంటగట్టేవారు. పసికందుల కొనుగోలుకు నమ్రత రేట్లు కూడా నిర్ణయించినట్టు ఈడీ గుర్తించింది. ఆడబిడ్డకైతే రూ.3.5 లక్షలు, మగబిడ్డకైతే రూ.4.5 లక్షల చొప్పున ఏజెంట్లకు, కన్నతల్లిదండ్రులకు చెల్లించేవారు. అయితే, డాక్టర్ నమ్రత చేస్తున్న అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో గతంలోనే అధికారులు ఆమె సికింద్రాబాద్ ఆస్పత్రి లైసెన్సు ను రద్దు చేశారు.

దీంతో ఆమె ఈ ప్రసవాలను విశాఖపట్నంలోని తన ఆస్పత్రికి మార్చింది. మున్సిపల్ అధికారులకు పంపే బర్త్ రిపోర్టులను సైతం ఫోర్జరీ చేసి, కన్నతల్లిదండ్రుల పేర్లకు బదులుగా, డబ్బులు ఇచ్చి న దంపతుల పేర్లను అందులో చేర్చినట్లు విచారణలో వెల్లడైంది. కేసులు నమోదై, లైసెన్స్ రద్దయినా సరే.. 2014 నుంచి ఆమె ఈ చీకటి దందాను ఏమాత్రం భయం లేకుండా కొనసాగించినట్లు ఈడీ తెలిపింది.

పాపపు సొమ్ముతో ఆస్తుల కొనుగోలు

నకిలీ సరోగసీ పేరుతో సంతానలేమి దం పతుల నుంచి డాక్టర్ నమ్రత చెక్కులు, నగ దు రూపంలో భారీ ఎత్తున నిధులు వసూ లు చేసింది. ఆ డబ్బులో కొంత భాగాన్ని దళారులకు కమీషన్‌గా, కన్నవాళ్లకు బిడ్డల కొనుగోలుకు చెల్లించింది. మిగిలిన సొమ్ము ను తన పేరిట, తన కుమారుల పేరిట ఆస్తులు కొనుగోలు చేసేందుకు మళ్లించింది.

దీంతో రూ.29.76 కోట్ల రిజిస్ట్రేషన్ విలువ ఉన్న 50 డాక్యుమెంట్లను ప్రస్తుత మార్కెట్ విలువ రూ.50 కోట్లు సీజ్ చేశారు. ఇందు లో భూములు, ఫ్లాట్లతో పాటు ఆస్పత్రి భవనం కూడా ఉంది. కాగా గత నెల ఫిబ్రవరి 12న నమ్రతను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ కస్టడీలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.