19-07-2025 12:00:00 AM
పటాన్ చెరు, జులై 18 : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ పరిశోధక విద్యార్థిని వాణి మాధురి వెలవలపల్లి ఫార్మాస్యూటికల్ లో జరిపిన పరిశోధనకు డాక్టరేట్ లభించింది. భవిష్యత్తు క్షయ, క్యాన్సర్ నిరోధక ఏజెంట్లుగా కొత్త ఆక్సిండోల్ ఉత్పన్నాల రూపకల్పన, అభివృద్ధిపై ఆమె అధ్యయనం చేసి సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్, సహ-మార్గదర్శి రసాయన శాస్త్ర ప్రొఫెసర్ గుండ్ల రాంబాబు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.
డాక్టర్ వాణి మాధురి అధ్యయనం మైకోబాక్టీరియం ట్యూబర్ క్యులోసిస్ (Mtb), బ్రూటన్స్ టైరోసిన్ కినేస్ (BTK) లను లక్ష్యంగా చేసుకుని నూతన ఆక్సిండోల్ ఆధారిత సమ్మేళనాల అభివృద్ధిపై దృష్టి పెట్టిందన్నారు. ఇది వివిధ క్యాన్సర్లు, స్వయం ప్రతిరక్షక (ఆటో ఇమ్యూన్) వ్యాధులలో చిక్కుకున్న కీలకమైన ఎంజైమ్ అని తెలిపారు. ఈ పరిశోధన ఔషధ-నిరోధక ట్యూబర్ క్యులోసిస్ (MౄR/XౄR-TB) యొక్క పెరుగుతున్న ప్రపంచ సవాలును పరిష్కరిస్తుందని, క్యాన్సర్ చికిత్సకు ఆశాజనకమైన మార్గాన్ని చూపుతుందన్నారు.
ఈ అధ్యయనం కొత్త సమ్మేళన భాండాగారాన్ని సృష్టించడానికి దారితీసిందని, అనేక ఉత్పన్నాలు ఇన్-విట్రో, కంప్యూటేషనల్ మోడల్ లలో బలమైన క్షయ, క్యాన్సర్ నిరోధక కార్యకలాపాలను ప్రదర్శిస్తాయని పేర్కొన్నారు. డాక్టర్ వాణి మాధురి సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్‌ఆర్ వర్మ, పలు విభాగాల అధిపతులు, సిబ్బంది పలువురుఅభినందించారు.