సైబరాబాద్‌లో గుప్పుమన్న డ్రగ్స్
కొండాపూర్ క్వేక్ ఎరినా పబ్‌పై ఈగల్ టీమ్ దాడులు
64 మందికి పరీక్షలు, 8మందికి పాజిటివ్
నిందితుల్లో ఏపీ మహిళా ఐఏఎస్ కుమారుడు
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): సైబరాబాద్ కమిషనరేట్ పరిధి లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధి కొండాపూర్ ‘క్వేక్ అరినా పబ్’పై టాస్క్ ఫోర్స్ ఈగల్ టీమ్, సైబరాబాద్ నార్కోటిక్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. అంతర్జాతీయ డీజే ‘బ్లాక్ కాఫీ’ ఈవెంట్ సందర్భంగా పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో దాడు లు చేశారు.
డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు వచ్చిన ముందస్తు సమాచారం ఆధారంగా ఆరు ప్రత్యేక బృందాలతో సోదాలు చేసినట్లు ఈగల్ టీమ్ అధికారులు తెలిపారు. పార్టీకి హాజరైన 64 మందికి పరీక్షలు నిర్వహించగా, వారిలో 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందన్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న ట్లు పోలీసులు ఈగల్ టీమ్ అధికారులు వెల్లడించారు. దాడుల అనంతరం అందరికీ ఏబా న్ డ్రగ్ పరీక్ష కిట్లను ఉపయోగించి పరీక్షలు చేసినట్లు తెలిపారు.
నిందితుల్లో నలుగురు గంజాయి, బెంజోడియాజెపైన్ వాడినట్లు తేలింది. అలాగే మరో నలుగురు గంజాయి, మెథాంఫేటమిన్ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో 8 మందిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. డ్రగ్ పాజిటివ్‌గా వచ్చిన వారిలో ఏపీకి చెందిన ఓ మహిళా ఐఏఎస్ అధికారి కుమారుడు ఉన్నట్లు తెలుస్తోంది.
వారిపై గచ్చిబౌలి పోలీసులు ఎన్డీపీ ఎస్- 1985 సెక్షన్ 8(సి), 27(ఎ), 27(బి)ల కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు స్పెయిన్‌కు చెందిన కళాకారులూ ఈ పార్టీలో పాల్గొన్నట్లు తెలిపారు. అలెగ్జాండర్, క్వేక్ ఎరీనా డీజే కేవీలకు డ్రగ్ పరీక్షలు చేయగా, నెగటివ్ వచ్చినట్లు వెల్లడించారు. ఈ దాడి సమయంలో టాలీవుడ్ సీనియర్ నటి హేమ కూడా పబ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
ఆమెకు కూడా డ్రగ్స్ టెస్ట్ చేయగా నెగెటివ్ వచ్చింది. దీనిపై స్పందించిన హేమ, తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో విడుదల చేసి, టెస్ట్ రిపోర్టును చూపించారు. మీ హేమక్క ఎప్పుడూ తప్పు చేయదని, ఈగల్ టీమ్ చేసిన వైద్య పరీక్షలో తనకు నెగెటివ్ వచ్చింది అంటూ ఆమె స్పష్టం చేశారు.




