4 April, 2026 | 3:43 AM

బెట్టింగ్.. మాయ!

04-04-2026 01:56 AM

వ్యసనంతో భవిష్యత్తు ప్రశ్నార్ధకం

ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువత

చిన్నాభిన్నమవుతున్న కుటుంబాలు

ఐపీఎల్ ప్రారంభంతో మరింత జోరుగా..

సంగారెడ్డి, ఏప్రిల్ 3(విజయక్రాంతి): బెట్టింగ్ తో కొందరి జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. గెలిచిన వారు అత్యాశతో మళ్లీ డబ్బులు పెడుతూ పొగొట్టుకుంటున్నారు. ఓడిన వారు అప్పుల్లో కూరుకుపోతున్నారు. ముఖ్యంగా యువత ఈ మాయలో పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ భారిన పడి ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు సైతం ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకున్నాయి. ఆన్లైన్లో గేమ్ నుంచి మొదలైన వ్యసనం తర్వాత బెట్టింగ్స్కు దారి తీస్తున్నాయి.

ఒకప్పుడు పట్టణాలకే పరిమితం కాగా ఇప్పుడు పల్లెలకు సైతం పాకింది. ప్రస్తుతం ఐపీఎల్ షురూ కావడంతో క్రేజ్ పెరిగింది. దీనిని ఆసరాగా చేసుకొని కొంతమంది దందాగా మార్చుకున్నారు. యువతతో పాటు ఉద్యోగులు, విద్యార్థులు బెట్టింగులకు ఆకర్షితులవుతున్నారు. తెలిసీ తెలియని వయస్సులో ఉచ్చులో పడి ఆర్థికంగా నష్టాలను చవిచూస్తున్నారు. కూలీనాలీ చేసుకునే వారు, ప్రైవేట్ ఉద్యోగులు సైతం బాధితులుగా మారుతుండడం గమనార్హం. 

లొకేషన్లు మారుస్తూ...

ఆన్ లైన్ బెట్టింగ్ నిషేధం ఉన్నప్పటికీ యాప్ల ద్వారా లొకేషన్ చేంజ్ చేస్తూ వీటిని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని యువత యాప్ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్స్ కొనసాగిస్తున్నారు. పదుల సంఖ్యల్లో వ్బుసైట్లు, యాప్లలో ఇది నడుస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఐపీఎల్ సందర్భంగా జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. జట్టులో ఆటగాళ్ల తీరు, మ్యాచ్ గెలిచేదెవరు...ఫోర్, సిక్స్.. ఇలా అన్నింటికి వేల రూపాయల్లో బెట్టింగ్ పెడుతున్నారు. యువకులతో పాటు పలు వ్యాపారులు సైతం ఈ మోజులో పడి అప్పుల పాలవుతున్నారు. ఈ క్రేజ్ను దందాగా మలుచుకొని కొంత మంది బెట్టింగ్ యాప్ ద్వారా తమ జేబులు నింపుకుంటున్నారు.

బెట్టింగులపై పోలీసుల ఫోకస్..

ఆన్లైన్ బెట్టింగ్లపై పోలీసులు ఫోకస్ పెట్టారు. సీసీఎస్ సిబ్బంది కన్నేసి ఉంచారు. ఎక్కడైనా ఆన్లైన్ బెట్టింగ్ సాగుతున్నట్లు సమాచారం అందిస్తే వెంటనే అప్రమత్తమవుతున్నారు. వారిపై కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో ఆన్లైన్ బెట్టింగ్ నిషేధం ఉంది. ఇటీవల ప్రభుత్వం అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారు జిల్లాలో అవగాహన కార్యక్రమాలతో పాటు అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నా రు. ఎక్కడైనా బెట్టింగ్ జరిగితే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు చెబుతున్నారు.