9 July, 2026 | 1:56 AM

బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి

09-07-2026 01:24 AM

డోర్నకల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్

మహబూబాబాద్, జూలై 8 (విజయ క్రాంతి): బాధ్యతాయుతంగా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని, గ్రామస్థాయిలో ప్రజల్లో సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ పోలీస్ అధికారులను, సిబ్బందికి సూచించారు. బుధవారం డోర్నకల్ పోలీస్ స్టేషన్ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ నిర్వహణ, పెండింగ్ కేసుల పురోగతి, రికార్డులు, రిసెప్షన్, స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, సిబ్బంది పనితీరు, ప్రజలకు అందిస్తున్న సేవలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్లోని పెండింగ్ కేసుల వివరాలను సమీక్షించి దర్యాప్తు వేగవంతం చేసి నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

బాధితులకు సత్వర న్యాయం అందేలా ప్రతి కేసును బాధ్యతాయుతంగా విచారించాలని సూచించారు. స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి, వారి సమస్యలను ఓర్పుతో విని చట్టపరమైన పరిష్కారం చూపాలని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పోలీసింగ్ ఉండాలని, ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండే సేవా దృక్పథంతో విధులు నిర్వహించాలని సూచించారు. నేరం జరిగిన తర్వాత స్పందించడం మాత్రమే కాకుండా, నేరాలను ముందుగానే నిరోధించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.