బీజేపీ కనుసన్నల్లో ఈసీ
మోదీ, రేవంత్ వ్యాఖ్యలపై చర్యలు లేవెందుకు
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్న
హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): దేశంలోని మతాలు, జాతుల ఆధారంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా దారుణంగా వ్యాఖ్యలు చేసినా, వారిపై ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు ప్రశ్నించారు. బీజేపీ కనుసన్నలో ఎన్నికల కమీషన్ నడుస్తుందనే విషయంపై తాము స్పష్టంగా ఆరోపణలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఆ పార్టీ సోషల్ మీడియా ముస్లింలపై నేరుగా విషం చిమ్ముతూ పోస్టులు పెట్టినా ఎందుకు పట్టించుకోవడంలేదని, ముస్లింలే ఎక్కువ మంది పిల్లలను కంటారని ఇష్టానురీతిగా వ్యాఖ్యలు చేసినా స్పందిం చడం లేదని మండిపడ్డారు. మోదీపై 20వేల ఫిర్యాదుల వచ్చినా కనీసం నోటీసులు ఇవ్వడంలేదని, ఆయనకు భయ పడి బీజేపీ అధ్యక్షులు నడ్డాకు ఈసీ నోటిసులు జారీ చేసిందన్నారు.
ఆ పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో రాముడి పోటో పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని, కేసీఆర్ విషయంలో మాత్రం ఆగమేఘాల మీద నోటీసులు ఇచ్చారని అన్నారు. సిరిసిల్లలో జరిగిన ప్రెస్‌మీట్‌లో కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అన్నందుకే నోటీసులు ఇవ్వడం కక్ష సాధింపు చర్య అని మండిపడ్డారు. బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఇవ్వడంలేదని నేతన్నలు ఆవేదనతో చెబితే కేసీఆర్ స్పందించారని, నిరోద్‌లు, పాపడాలు అమ్ముకోవాలని ఒక దుర్మార్గుడు అంటే దానిని ఖండిస్తూ కొంచెం కఠిన పదాలు వాడరన్నారు. దీనిపై చర్యలు తీసుకుంటే, మరి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఆయనపై తమ పార్టీ ఫిర్యాదు చేసినా ఈసీ నిర్లక్ష్యం చేసిందన్నారు.
కేసీఆర్ సభలకు వస్తున్న స్పందన చూసి కాంగ్రెస్, బీజేపీలకు దడ పుడుతున్నదని, చోటా బాయ్, బడాబాయ్ మోసాలను రోడ్‌షోలో ప్రజలకు వివరిస్తుంటే ఓడిపోతామనే భావనతో కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌కు 12 సీట్లు వస్తాయని సర్వేలు రిపోర్టు లు చూసి చోట, బడా బాయ్‌లు భయపడ్డారని ఎద్దేవా చేశారు. ఖచ్చితంగా ఈ రెండు పార్టీల కుట్రలకు ఓటు ద్వారానే జవాబు చెప్పాలని ప్రజలను కోరారు. మార్చి 18న ఓయూలో నీటి కొరత, కరెంటు సమస్య ఉం దంటూ కేసీఆర్ దృష్టికి వచ్చిందని అదే సమస్యలను ప్రస్తావిస్తూ చేతగాని ప్రభుత్వ మంటూ ట్విట్టర్‌లో ఒక పోస్టు చేశారే తప్ప అంతకంటే ఏమి చేయలేదన్నారు.
చీప్ వార్డెన్ స్టాంప్‌ను మార్చేసి సీఎం తప్పుడు డాక్యుమెంట్ పెట్టాడని, తప్పుచేసింది ముఖ్యమంత్రి అయితే మా పార్టీ నాయకుడు క్రిశాంక్‌ను ఎందుకు అరెస్టు చేశారని నిలదీశారు. అసలు జైల్లో ఉండాల్సింది రేవంత్‌రెడ్డి అని, తాము తప్పు చేస్తే చంచల్ గూడ జైలుకు సిద్ధమని, లేదంటే ఆయన జైలుకు వెళ్లాతాడా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ రెండు ఒకటేనని, ఈసీ కచ్చితంగా మోదీ, రేవంత్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. పోర్జరీ చేసిన సీఎంను జైల్లో పెట్టకుండా అది తప్పని చెప్పినవారిని జైళ్లో పెట్టడం ఏమిటన్నారు. ప్రజలు గమ నిస్తున్నారని, త్వరలో ఈ రెండు పార్టీలకు గుణపాఠం తప్పదని కేటీఆర్ హెచ్చ రించారు.




