2 April, 2026 | 10:17 AM

ఫోన్ ట్యాపింగ్ కేసు క్లోజ్!

03-05-2024 12:44 AM

కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ ప్రయత్నం

కాంగ్రెస్‌కు సన్నిహితంగా ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు

కాంగ్రెస్ అభ్యర్థి బంధువు కూతురు ఇంట్లోనే షెల్టర్

ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు ప్రభాకర్‌రావు డబ్బులు

కరీంనగర్‌కు చెందిన మంత్రి ద్వారానే పంపిణీ

కేటీఆర్ ఇలాకా సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్

నాతో పాటు రేవంత్‌రెడ్డి, హరీశ్‌రావు బాధితులే 

కేసు నీరుగార్చేందుకు ఓ మంత్రితో కేసీఆర్ ఒప్పందం

కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే కేసు సీబీఐకి అప్పగించాలి 

బీజేపీ నేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్/కరీంనగర్, మే 2 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాం లో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తాను అతిపెద్ద బాధితుడినని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. తనతోపాటు సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు కూడా బాధితులేనని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతి సందర్భంలోనూ తనకు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కుమ్మక్కవుతున్నాయని ఆరోపించారు. గతంలో కేసీఆర్ అనుసరించిన పంథానే ఇప్పుడు రేవంత్‌రెడ్డి కొనసాగిస్తున్నారని విమర్శించారు. దీనికి అదిపెద్ద ఉదాహరణ ఫోన్ ట్యాపింగ్ అంశమేనని అన్నారు. వ్యవస్థను భ్రష్టు పట్టించిన, వ్యక్తిగత స్వేచ్ఛపై దాడిచేసిన ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిం చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో మియాపూర్ భూములు, డ్రగ్స్ కేసు, టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు మాదిరిగానే ఫోన్ ట్యాపింగ్ కేసును మూసివేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. 

ఫోన్ ట్యాపింగ్ తతంగమంతా కేటీఆర్ ఇలాకా అయిన సిరిసిల్ల కేంద్రంగానే జరిగిందని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు రావడంతో కేసీఆర్ కుటుంబం కరీంనగర్‌లోని ఓ మంత్రితో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నదని ఆరోపించారు. కేసీఆర్ కుటుం బమిస్తున్న సలహాలు, సూచనలకు అనుగుణంగానే ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్‌రావు అమెరికాలోని అశోక్‌రావు కూతురు ఇంట్లో ఉంటూ.. అక్కడి నుంచి దుబాయి వెళ్లి వస్తున్నాడని, ఆయనకు పదేళ్లపాటు వీసా ఉందని అన్నారు.

ప్రభాకార్‌రావును ఇండియాకు రప్పించేందుకు చర్యలెందుకు తీసుకోవటంలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయన అమెరికా నుంచి తిరిగి రావద్దనే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారని ఆరోపించారు. ప్రభాకర్‌రావును ఇండియాకు రప్పిస్తే సిరిసిల్లలో కేటీఆర్ కనుసన్నల్లో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమంతా వెలుగులోకి వస్తుందని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ సహా బాధ్యులంతా దోషులుగా మారతారని తెలిసి కూడా ప్రభాకర్‌రావును ఇండియాకు ఎందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తలేరని నిలదీశారు.

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కుమ్మక్కై

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు కుమ్మక్కయ్యాయి కాబట్టే ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగారుస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. రెండు పార్టీలు ఒక్కటై కరీంనగర్‌లో తనను ఓడించేందుకు కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. తక్షణమే ఫోన్ ట్యాపి ంగ్ అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని, కేసు వివరాలన్నీ ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకే ట్యాపింగ్ చేశామని రాధా కిషన్‌రావు చెప్పినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు.

దేశ భద్రతకు సంబంధించిన అంశమైనందున ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ కేసు ను సీబీఐకి అప్పగించాలని, లేదంటే ఫోన్ ట్యాపింగ్ అంశంలో బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కైనట్లుగా తేలిపోతుందని అన్నా రు. కేసీఆర్ సిగ్గు లేకుండా భార్యాభర్తలు మాట్లాడుకునే అంశాలను కూడా ట్యాప్ చేయించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాంటి దుర్మార్గుడికి కాంగ్రెస్ నేతలు వత్తా సు పలుకుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందనే అనుమానాలున్నా యని, అందుకే ఫేస్‌టైమ్, సిగ్నల్ యాప్‌ల ద్వారా మాట్లాడుకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. సీబీఐ విచారణకు ఆదేశిస్తే తన వద్ద ఉన్న సమాచారమంతా ఇస్తానని బండి తెలిపారు. 

నిందితుడి బంధువు ఇంట్లో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి

కరీంనగర్‌లో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న వెలిచాల రాజేందర్‌రావుకు ఫోన్ ట్యాపింగ్ నిందితుడితో సంబంధాలున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి టిక్కెట్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపిం గ్ ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు వియ్యంకుడు అశోక్‌రావు ఇంట్లో కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఉంటున్నారని తెలిపారు. ప్రభాకర్‌రావు అమెరికాలోని అశోక్‌రావు కూతురు ఇంట్లోనే ఉన్నారని చెప్పారు.

తమ ఇద్దరిలో ఎవరు గెలిచినా ఫర్వాలేదు కానీ బండి సంజయ్ మాత్రం గెలవకూడదని కరీంనగర్‌లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు కూడబలుక్కుని కుట్రకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభాకర్‌రావు ఇచ్చిన డబ్బులు కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి ద్వారా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నేతలకు ముట్టాయని, అందుకే ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఎవరిపైనా చర్యలు తీసుకునే పరిస్థితి కనిపించడంలేదని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్, 6 గ్యారెంటీలను మరుగున పెట్టేందుకే రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు.