calender_icon.png 26 May, 2025 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈసెట్ ఫలితాలు విడుదల

26-05-2025 12:06:16 AM

  1. 93.87శాతం ఉత్తీర్ణత..

జూన్ 15 నుంచి కౌన్సెలింగ్ షెడ్యూల్

తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి

హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): రాష్ర్టంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో నేరుగా ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ ఈసెట్-2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఈసెట్‌లో 93.87 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి తెలిపారు. కౌన్సెలింగ్‌ను జూన్ 15 నుంచి ప్రారంభించడానికి షెడ్యూల్ సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు.

ఈసెట్ ఫలితాలను ఆదివారం మధ్యాహ్నం ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో విడుదల చేశారు. ఈసెట్ ఫలితాల్లో 93.87 శాతం ఉత్తీర్ణత సాధించగా.. మెటలార్జికల్ ఇంజినీరింగ్, బీఎస్సీ మ్యాథ్స్, ఫార్మసీలో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. బీఎస్సీ మ్యాథ్స్‌లో సంతోష్ కుమార్, కెమికల్ ఇంజినీరింగ్‌లో ఎల్ తేజసాయి, సివిల్ ఇంజినీరింగ్‌లో జీ నిఖిల్‌కౌశిక్, సీఎస్‌ఈలో శ్రీకాంత్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ కే రేవతి,

ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో కాసుల శ్రావణి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో రాపర్తి చందన, మెకానికల్ ఇంజినీరింగ్‌లో పోతుగంటి కార్తిక్, మెటలర్జికల్ ఇంజినీరింగ్‌లో తోట సుబ్రహ్మణ్యం, మైనింగ్ ఇంజినీరింగ్‌లో కుర్మ అక్షయ, ఫార్మసీలో వాలి చందన మొదటి ర్యాంకు సాధించారు. 

17,768 మంది పాస్..

ఈసెట్ -2025కి 19,672 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 18,928 మంది పరీక్షలకు హాజరయ్యారు. అందులో 17,768 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈసెట్‌కు బాలురు 12,326 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 11,835 మంది హాజరైతే అందులో 10.972 మంది అర్హత సాధించారు. బాలురలో 92.71 శాతం అర్హత సాధించారు. ఇక బాలికల విషయానికొస్తే 7,346 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 7,093 మంది పరీక్షకు హాజరయ్యారు.

వారిలో 6796 మంది అర్హత సాధించారు. బాలికల్లో 95.81 శాతం అర్హత సాధించారు. ఈసెట్ ఫలితాల సందర్భంగా పలు ప్రశ్నలకు వీసీ ప్రొఫెసర్ ఎం.కుమార్ సమాధానాలిచ్చారు. యూనివర్సిటీ పరిధిలోని కొన్ని కోర్సులకు ఫీజులు ఎక్కువగా ఉన్నాయని..వాటిని ఓయూలో చేరే పేద విద్యార్థులు చెల్లించలేరని చెప్పగా.. ఫీజులపై పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

ఆగస్టులో యూనివర్సిటీ స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తామని..ప్రతీ ఏడాది స్నాతకోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ ఎం.కుమార్, ఉన్నత విద్యా మండలి వైస్ చైైర్మన్ ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, ఈ సెట్- 2025 కన్వీనర్ ప్రొఫెసర్ పీ చంద్రశేఖర్ పాల్గొన్నారు.