1 August, 2026 | 9:43 PM

ప్రజా ప్రభుత్వంలో విద్యకు ప్రాధాన్యం

03-09-2025 12:15 AM

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

చిట్యాల, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి) : ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.ఈ మేరకు ఎమ్మెల్యే మంగళవారం చిట్యాల మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల,కళాశాల,వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసి తరగతి గదులను సందర్శించారు.

ఈ క్రమంలో విద్యార్థులు పాఠశాల గ్రౌండ్ లో వర్షపు నీరు నిలుస్తుందని వివిధ సమస్యలు తెలుపగా వెంటనే ఎమ్మెల్యే సంబంధిత శాఖ ఏఈ జీవన్ కుమార్ తో ఫోన్ లో సంభాషించి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.అలాగే అన్ని సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు.అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి భోజనం చేసి మాట్లాడారు.ప్రజా ప్రభుత్వం నాణ్యమైన విద్యతో పాటు,భోజనాన్ని అందిస్తుందని అలాగే విద్యార్థులకు మెస్ చార్జీలతో పాటు కాస్మొటిక్ చార్జీలను పెంచినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు.విద్యార్థులు చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

పేదల పెన్నిధి వైఎస్సార్..

చిట్యాల, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి) : పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పని చేసిన గొప్ప వ్యక్తి వై.యస్ రాజశేఖర్ రెడ్డి అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.మంగళవారం వైఎఎస్సార్ 16 వ వర్ధంతి వేడుకలను చిట్యాల మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి నిర్వహించగా ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొని వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు.

వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం వైఎస్‌ఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని, ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత వైయస్సార్ కి దక్కుతుందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్సార్ సేవలు మరువ లేనివని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.