21-01-2026 12:00:00 AM
ఈఎంఆర్‌ఎస్‌ను సందర్శించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
కొత్తగూడెం, జనవరి 20 (విజయక్రాంతి ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం మండలంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల (EMRS) ను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని సాధారణ కార్యకలాపాలు, మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలు, విద్యార్థులకు అందుతున్న సదుపాయాలపై అధికారులను అడిగి సమగ్రంగా తెలుసుకున్నారు.
పాఠశాలలో గిరిజన విద్యార్థుల విద్యా అవసరాలు, పాఠ్యపుస్తకాల లభ్యత, బోధనా విధానాలు, అకాడమిక్ సపోర్ట్ వ్యవస్థపై జిల్లా కలెక్టర్ వివరంగా ఆరా తీశారు. విద్యార్థుల సమగ్ర విద్యాభివృద్ధికి అవసరమైన అన్ని రకాల పుస్తకాలు, విద్యా వనరులు అందిస్తామని తెలిపారు. గిరిజన విద్యార్థులు పోటీ ప్రపంచంలో ముందుకు సాగేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు, జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో సన్నిహితంగా మమేకమైన జిల్లా కలెక్టర్, గిరిజన పిల్లల అభ్యుదయానికి తనకు ప్రత్యేక ఆసక్తి ఉందని తెలిపారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల అభివృద్ధికి అవసరమైన ప్రతి అంశంలో తన సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని జిల్లా కలెక్టర్ భరోసా ఇచ్చారు. ఈ సందర్శనలో కలెక్టర్ వెంట పాఠశాల ప్రిన్సిపల్, బోధన బోధనేతర సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.