calender_icon.png 17 July, 2025 | 10:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యా!.. అదో వ్యాపారం!!

19-06-2025 12:00:00 AM

విద్యా సంవత్సరం ప్రారంభమయిందంటే తల్లిదండ్రుల గుండెల్లో దడ మొదలవుతుంది. ప్రైవేటు స్కూళ్లలో, కాలేజీల్లోనే చదువులు బాగా చెపుతారనే భావన తల్లిదండ్రుల్లో స్థిరపడి పోయింది. కనుక, అల్పాదాయ వర్గాల నుంచి సంపన్నుల వరకు ప్రైవేటు స్కూళ్లవైపే చూస్తున్నారు. ఒక పద్ధతి ప్రకారం చదువులు చెపుతున్న ప్రభుత్వ స్కూళ్లు లేకపోలేదు. అలాంటి స్కూళ్ల నిర్వహణకు నానా తంటాలు పడుతున్న ప్రధానోపాధ్యాయులూ ఉన్నారు.

అయినా పుట్టగొడుగుల్లా ప్రైవేటు స్కూళ్లు పుట్టుకొచ్చాయి. అవి తల్లిదండ్రులను ఆకర్షించే తీరే వేరు. పిల్లల్ని చేర్పించాక ప్రైవేటు స్కూళ్లు ముక్కు పిండినట్లు వసూలు చేసే ఫీజులు మామూలుగా వుండవు. ప్రతి ఏటా ట్యూషన్ ఫీజులు తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నట్లుగా పెరుగుతుంటాయి. వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రతి విద్యా సంవత్సరం ప్రభుత్వం ప్రకటించడం ఒక తంతులా మారింది.

ఒక్క ట్యూషన్ ఫీజే కాదు, ఇతర ఫీజులకు అడ్డే వుండదు. ఇక పుస్తకాలకు, స్కూలు బస్సుల చార్జీలు, స్కూళ్లో పిల్లలు పాల్గొనే ఇతర కార్యక్రమాలకు అయ్యే ఖర్చులకు ఒక పొంతన అంటూ వుండదు. పాఠ్య పుస్తకాలకు అంత ఖరీదు ఎందుకో ఎవరూ చెప్పలేరు. పై తరగతులకు వెళ్లే కొద్దీ వాటి ధరలు కూడా విపరీతంగా పెరుగుతుంటాయి. తల్లిదండ్రులు తమ పిల్లలు భవిష్యత్‌లో ఏం కాదలుచుకున్నారో వారికే ఒదిలేద్దాం అని అనుకుంటే ప్రైవేటు స్కూళ్లు చూస్తూ ఊరుకోవు.

మీ పిల్లలు పెద్దయ్యాక ఏం చదువుకుంటారో ఇప్పటి నుంచే పునాది వేయండంటారు. ఐఐటీ కోసమో మరో దాని కోసమో ప్రత్యేకంగా పుస్తకాలు కాని, అదనంగా ఫీజు చెల్లించి పాఠ్యపుస్తకాలకు తోడుగా వాటినీ చదివించండని ఒత్తిడి తెచ్చే ప్రైవేటు స్కూళ్లు వున్నాయి. అదనపు రాబడిపైనే వాటి దృష్టి. బ్రాండెడ్ టెక్ట్స్‌బుక్స్, నోట్‌బుక్స్ అంటూ అదో వ్యాపారం. యూనిఫాం, పుస్తకాలు, షూస్ తాము చెప్పిన షాపుల్లోగానీ లేదంటే క్యాంపస్‌లోనే కొనుక్కోవాలని కొన్ని ప్రైవేటు స్కూళ్లు షరతు పెడతాయి. వాటికి అంత ఖరీదు ఎందుకుంటుందని అడగకూడదు.

ప్రతి ఏడాది స్కూలు ఫీజు మొత్తం ఇంతే కదా అని తల్లిదండ్రులు ఒక బడ్జెట్‌ను అంచనా వేసుకుంటే కుదరదు. ఎప్పుడైనా ప్రైవేటు స్కూళ్ల నుంచి మీపై పిడుగు పడవచ్చు. గతంలో ఐదారుగురు పిల్లలున్న తల్లిదండ్రులు ఏనాడు పిల్లల చదువుల గురించి బెంగ పడినట్లు కనిపించేది కాదు. జిల్లా పరిషత్ స్కూళ్లు, ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలు హాయిగా చదువుకొనే వారు. ఇప్పుడు ఒకరిద్దరు పిల్లలున్నా, వారి చదువుల భారం గురించి తల్లిదండ్రులు తల్లడిల్లాల్సి వస్తున్నది.

ఏడాదికి ఇంత అని ఫీజు వసూలు చేసే ప్రైవేటు స్కూళ్లు అదనంగా దోపిడీకి పాల్పడుతున్నా ప్రభుత్వ నియంత్రణ ఉండదు. విద్యను లాభసాటి వ్యాపారంగా భావిస్తున్న కొన్ని ప్రైవేటు స్కూళ్ల ఆగడాలకు అడ్డే లేదు. నిర్వహణ ఖర్చులు అని మొసలి కన్నీరు కార్చే ఇలాంటి స్కూళ్లలో ప్రతిరోజు, ఆ మాటకొస్తే సెలవుల్లో కూడా అరవ చాకిరీ చేసే ఉపాధ్యాయులకు ఇస్తున్న వేతనం ఎంత?

ప్రైమరీ విద్య స్థాయిలో కూడా తల్లిదండ్రుల నుంచి వేలల్లో ఫీజులు వసూళ్లు చేస్తున్న కొన్ని ప్రైవేటు స్కూళ్లను ప్రభుత్వం నియంత్రించలేదా? పాఠ్య పుస్తకాలు ఎన్‌సీఈఆర్‌టీ, ఎస్‌సీఈఆర్‌టీ నుంచి తీసుకుంటే సరిపోదా? నోట్‌బుక్స్, యూనిఫాంలు, స్టేషనరీకి అంత ధర ఎందుకు? ప్రతి విద్యా సంవత్సరంలో పొడచూపే ప్రశ్నలివి? సమాధానాలే వుండవు.