19-06-2025 12:00:00 AM
రాష్ట్ర వ్యాప్తంగా జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. పోలింగ్, పోలీస్ సిబ్బంది నియామకానికి ఎంతమంది అవసరమవుతారనే అంశంలో ఇప్పటికే ప్రాథమికంగా సమాచారం సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. పరిషత్‌లకు పార్టీల ప్రాతిపదికన, గ్రామ పంచాయతీలకు, వార్డు సభ్యులకు పార్టీ రహితంగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకోసం వేర్వేరుగా బ్యాలెట్ పత్రాలు, గుర్తులను ఇప్పటికే సిద్ధం చేశారని కూడా సమాచారం. రిజర్వేషన్లను ఎలా ఖరారు చేయాలనే అంశంపై ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా సందడి మొదలైంది. బీసీ రిజర్వేషన్ల విషయాన్ని ప్రభుత్వం తేల్చితే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.
రిజర్వేషన్ల అనంతరం రంగంలోకి దిగేందుకు నాయకులు సిద్ధమవుతున్నారు. జిల్లా మండల పరిషత్, పంచాయతీ ఎన్నికలకు వారంలో షెడ్యూల్ వస్తుందని చర్చ జరుగుతోంది. ఇటీవల మంత్రులు పలు సందర్భాలలో ఎన్నికల గురించిన ప్రకటనలు కూడా చేస్తుండటం గమనార్హం.
స్థానిక సంస్థల ఎన్నికలకు ఏ సమయంలోనైనా షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉండటంతో అధికారులు సైతం సిద్ధంగా ఉన్నారు. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్లు, మునిసిపాలిటీలకు పాలకవర్గాల గడువు ముగిశాక సకాలంలో ఎన్నికలు నిర్వహించలేక పోవడంతో ప్రస్తుతం అవన్నీ ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్నాయి.
పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు, వాటితోపాటు రాష్ట్ర ప్రభుత్వం జత చేయాల్సిన రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు నిలిచి పోయాయి. దీంతో పల్లెలు, పట్టణాల్లో ఎక్కడి పనులు అక్కడే ఆగి పోవడంతోపాటు పాలన గాడి తప్పుతున్నట్టు ఫిర్యా దులు వస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది.
దాన్ని తక్షణం అమలు చేశాకే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ వినిపిస్తోంది. దీంతో ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. వార్డు మొదలు జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గం వరకు ఏ స్థానం, ఏ కేటగిరీకి కేటాయిస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం అధికారిక రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండటానికి ఆస్కారం లేదు.
ఇదే సమయంలో తాజా కులగణన నివేదిక ప్రకారం రిజర్వేషన్ల అమలులో భాగంగా బీసీలకు తమ పార్టీనుంచి 42 శాతం సీట్లు కేటాయిస్తామని, జనరల్ స్థానాల్లో కూడా బీసీలకు ప్రాధాన్యం పెంచుతామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ విషయంపై క్షేత్రస్థాయి నాయకుల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.
రిజర్వేషన్ల కోటా, కేటాయింపులు
ఎప్పుడైనా షెడ్యూల్ వస్తుంది కనుక, ఆ మేరకు నిర్వాహక అంచనాలలో అధికార యంత్రాంగం నిమగ్నమై ఉంది. పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న సంకేతాలు కూడా పలువురకు అందుతున్నట్టు తెలుస్తున్నది. ఆటు అధికార యంత్రాంగం, ఇటు ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే రాజకీయ పార్టీల ఆశావహులు సర్వత్రా అప్రమత్తమవుతున్నారనే చెప్పాలి.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. పోలింగ్, పోలీస్ సిబ్బంది నియామకానికి ఎంతమంది అవసరమవుతారనే అంశంలో ఇప్పటికే ప్రాథమికంగా సమాచారం సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. పరిషత్‌లకు పార్టీల ప్రాతిపదికన, గ్రామ పంచాయతీలకు, వార్డు సభ్యులకు పార్టీ రహితంగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.
ఇందుకోసం వేర్వేరుగా బ్యాలెట్ పత్రాలు, గుర్తులను ఇప్పటికే సిద్ధం చేశారని కూడా సమాచారం. అయితే, రిజర్వేషన్లను ఎలా ఖరారు చేయాలనే అంశంపై ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ మేరకు రిజర్వేషన్ల కోటా, కేటాయింపులు చేస్తారు. ముందుగా పరిషత్‌లకు, తదుపరి పక్షం రోజుల వ్యవధిలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
తొలుత ఏ ఎన్నికలు నిర్వహించినా, ఫలితాలు ప్రకటించకుండా కోడ్ కొనసాగిస్తూ, ఎన్నికలు ముగించాలని, ఈ రకంగా అన్ని గ్రామాల్లోనూ ఎలాంటి ఘర్షణలకు ఆస్కారం లేకుండా చూడడంతోపాటు పాలనాపర ఇబ్బందులను అధిగమించవచ్చు అనేది ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాల ఆలోచనగా అధికారులు చెబుతున్నారు.
త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం
స్థానిక సంస్థలకు 2019లో జరిగిన ఎన్నికల్లో ఎస్టీలకు 7 శాతం, ఎస్సీలకు 15 శాతం, బీసీలకు 25 శాతం, మహిళలకు అన్ని కేటగిరీల్లో 50 శాతం రిజర్వేషన్లు కేటాయించారు. జడ్పీటీసీ స్థానాలకు, ఎంపీపీ పదవులకు పంచాయతీరాజ్ కమిషనర్ స్థాయిలో జిల్లాల వారీగా కోటాను ఖరారు చేస్తే, జిల్లాల్లో కలెక్టర్ల నేతృత్వంలో ఆ కోటా ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు అనుగుణంగా సీట్లను కేటాయించారు.
ఎంపీటీసీ స్థానాలకు, సర్పంచ్ పదవులకు కలెక్టర్ల స్థాయిలో మండలాల వారీగా కోటా ఖరారు చేసి, ఆర్డీవోల నేతృత్వంలో ఆయా మండలాల్లో సీట్లను కేటాయించారు. ఈసారి రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి తుది నిర్ణయం తీసుకున్నా మొత్తం రిజర్వేషన్ల కోటా 50 శాతానికి మించకుండా నిబంధనలు రూపొందిస్తారని తెలుస్తున్నది. ఆ మేరకు కోటా ఖరారు, సీట్ల కేటాయింపు గతం మాదిరిగానే చేపడతారా? లేక కోటా ఖరారు, కేటాయింపులపై మార్పులు, చేర్పులు తీసుకుంటారా? అనే విషయం కూడా తేలాల్సి ఉంది.
అయితే, ఈ వారంలోనే అన్ని అంశాలపై స్పష్టత వస్తుందని, వారం లోపే రిజర్వేషన్లపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ, అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పటికే గ్రామాల్లో, మండలాల్లో సర్పంచులుగా, ఎంపీటీసీ సభ్యులుగా, జడ్‌పీటీసీ, ఎంపీపీ పదవులపై ఆశలు పెంచుకున్న స్థానిక నాయకులు రిజర్వేషన్లు వారికి అనుకూలంగా వస్తే కదనరంగంలోకి దూకేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ప్రస్తుతం రాజకీయ వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా ఆయా గ్రామాలు, పట్టణాల్లో వేడెక్కింది. ఏ నోట విన్నా ఎన్నికల ముచ్చటే. పోటీ చేసేవారు ఆయా పార్టీల ప్రముఖులను ప్రసన్నం చేసుకోవడంలో నిమగ్నం అవుతున్నారు.