2 July, 2026 | 1:17 AM

సమస్యల వలయంలో సర్!

02-07-2026 12:00 AM

కొనసా.. గుతున్న ఎన్యూమరేషన్

పాత ఓటర్ల జాబితాలో తప్పులు

పరేషాన్లో బీఎల్‌ఓలు

గడువులోపు ప్రక్రియ పూర్తయ్యేనా..?

పటాన్‌చెరు, జూలై 1: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లాలో జూన్ 25 నుండి జూలై 24 వరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమం ఊపందుకుంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరుగుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అనేక లోటుపాట్లు, గందరగోళాలు, ప్రజల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 89 లక్షల ఓటరు రికార్డులలో తప్పులు లేదా అక్రమాలు ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రీ-సర్ మ్యాపింగ్ ప్రక్రియలో గుర్తించింది.

ఇందులో సంగారెడ్డి జిల్లాలోని పటాన్చేరు, సంగారెడ్డి రూరల్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున తప్పుడు డేటా నమోదైంది. పేరులో చిన్న స్పెల్లింగ్ తప్పులు, పాత చిరునామాలు ఉన్న జనాభా తమ ఓట్లు ఎక్కడ ఎగిరిపోతాయోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ప్రత్యర్థి వర్గాల ఓట్లను తొలగించడానికి ఫామ్-7ను పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 

నిబంధనల ఉల్లంఘన..

సరైన క్షేత్రస్థాయి విచారణ లేకుండా, కేవలం అనామక అప్లికేషన్ల ఆధారంగా అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించే ప్రమాదం పొంచి ఉందని రాజకీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఓటర్లు తమ 2026 ఓటరు వివరాలతో పాటు, 2002 నాటి ఓటరు సమాచారాన్ని కూడా ఎన్యుమరేషన్ ఫారంలో నింపాల్సి వస్తోంది. 

ఈ 2002 డేటా ముందే ప్రింట్ అయ్యి వస్తుందని భావించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రజలు దానిని మాన్యువల్గా వెతుక్కుని నింపాల్సి రావడం పెద్ద తలనొప్పిగా మారింది. వలస వచ్చిన కార్మికులు ఎక్కువగా ఉండే పటాన్చెరు వంటి పారిశ్రామిక ప్రాంతాలలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. సంగారెడ్డి జిల్లాకు పక్కనే ఉన్న హైదరాబాద్/మేడ్చల్ జిల్లాలకు లేదా పొరుగు రాష్ట్రాలకు (కర్ణాటక సరిహద్దు ప్రాంతాలు) మధ్య వేలాది మందికి రెండేసి చోట్ల ఓటరు నమోదు ఉంది. 

బీఎల్‌ఓలపై అదనపు భారం...

బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఈ ’డబుల్ ఓట్లను’ గుర్తించి ఫామ్స్ సేకరించడంలో ఇబ్బందులు పడుతున్నారు. చాలా ఇళ్లలో పగటిపూట ప్రజలు అందుబాటులో ఉండకపోవడం వల్ల సర్వే ఆలస్యమవుతోంది.  ఇళ్లకు వస్తున్న అధికారులు పౌరసత్వ నిరూపణల కోసం కొన్ని పత్రాలు అడుగుతున్నారనే పుకార్లు గ్రామీణ, మైనారిటీ ప్రాంతాలలో వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎలక్షన్ కమిషన్ ‘ఎటువంటి పౌరసత్వ నిరూపణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు‘ అని స్పష్టం చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో అవగాహన లోపంతో ప్రజలు సమాచారం ఇవ్వడానికి వెనుకాడుతున్నారు.