వంద రోజుల ప్రణాళికతో సమర్థవంతమైన సేవలు
గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి దానకిశోర్
హైదరాబాద్, మార్చి 1 (విజయక్రాంతి): ప్రభుత్వం అమలు చేస్తున్న 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలు ప్రజలకు సమర్థవంతమైన సేవలందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని గవర్నర్ కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి దానకిశోర్ పేర్కొన్నారు. విపత్తుల సమయంలో సమయోచిత స్పందన అత్యంత ముఖ్యమని, సమన్వయం, ముందస్తు జాగ్రత్తలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతోపాటు శిక్షణ పొందిన యువత పాత్ర ఎంతో ప్రాధాన్యమని తెలిపారు.
ఉస్మానియా యూనివర్సిటీలో ఆదివారం ఎన్‌ఎస్‌ఎస్ 120 మంది వాలంటీర్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రత్యేకంగా ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లకు సమగ్ర శిక్షణ అందించి, ఏ అత్యవసర పరిస్థితినైనా ధైర్యంగా, సమర్థవంతంగా ఎదుర్కొనేలా తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు.
భవిష్యత్ శిక్షణ కార్యక్రమాలను ఎన్‌ఎస్‌ఎస్, రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా నిర్వహించనున్న ఆ కార్యక్రమానికి గవర్నర్ హాజరై శిక్షణార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెఓసర్ నాగేశ్, అధికారులు చలమల్ల వెంకటేశ్వర్ల, ప్రతిఘ్న తదితరులు పాల్గొన్నారు.




