10-02-2026 12:26:00 AM
చిట్యాల, ఫిబ్రవరి 9 : ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మలను సోమవారం సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపురంలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా నాయకులు అవిశెట్టి శంకరయ్య మాట్లాడుతూ అమెరికా అధ్యక్షునికి భారత ప్రధాని మోడీ దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెడుతూ దేశంలో స్వేచ్ఛ వాణిజ్యo అమలయ్యే విధంగా చేసుకున్న ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.
కార్మికుల హక్కులను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడమే కాకుండా ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ విద్యుత్ సవరణ చట్టం, విత్తన సవరణ చట్టం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వంటి వ్యతిరేక విధానాలకు మోడీ ప్రభుత్వం పాల్పడుతుందని వీటికి నిరసనగా మోడీ, ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రజాసంఘాల నాయకులు.
మాట్లాడుతూ ఈనెల 12న జరగబోయే దేశవ్యాప్త సమ్మె లో రైతులు, కార్మికులు, కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఐతరాజు నరసింహ, జిల్లా కమిటీ సభ్యులు ఆరూరి శ్రీనివాస్, లడే రాములు, నర్సిరెడ్డి, మహేష్, సత్యనారాయణ, కిరణ్, శేఖర్, ఐలమ్మ, తదితరులు పాల్గొన్నారు.