07-10-2025 08:23:54 PM
గూడుపుఠాణి..?
హైదరాబాద్ కేంద్రంగా డీల్..?
బెల్లంపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని మూతపడిన సౌత్ క్రాస్ కట్ గని కబ్జా భూమి కోసం మళ్ళీ ప్రయత్నాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఓ బృందం హైదరాబాద్ కేంద్రంగా ఈ ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. ఎలాగైనా సింగరేణి భూమిని కైవసం చేసుకోవడానికి చేయని ప్రయత్నాలంటూ లేవు. అందుకోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే సదరు బృందం బెల్లంపల్లి ప్రజాప్రతినిధి వద్దకు వెళ్లి కలిశారని సమాచారం. వారిమధ్య డీల్ కూడా కుదిరిననట్టు ప్రచారం జోరుగా జరుగుతున్నది. బెల్లంపల్లి పట్టణ నడిబొడ్డున ఉన్న మూసివేత సౌత్ క్రాస్ కట్ గని స్థలం ఇటీవలే ఆక్రమణకు గురైన సంగతి తెలిసిందే. ఈ కబ్జాపై విజయక్రాంతిలో వరుస సంచలన కథనాలు ప్రచురితమయ్యాయి.
ఈ కథనాలకు స్పందించిన సింగరేణి యాజమాన్యం అట్టి స్థలం కబ్జాను అడ్డుకుంది. ఈనెల 3న మందమర్రి ఏరియా ఎస్టేట్ అధికారులు, సెక్యూరిటీ విభాగం అధికారులు, సిబ్బంది బెల్లంపల్లికి వచ్చి కబ్జాకు గురి అయిన స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. కబ్జా స్థలంలో హెచ్చరిక సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఫారెస్ట్ అధికారులతో కలిసి ఆ స్థలంలో మొక్కలను కూడా నాటారు. ఈ కబ్జాపై స్వయంగా మందమర్రి జీఎం ఎన్ రాధకృష్ణ తీవ్రంగా స్పందించారు. ఎట్టి పరిస్థితిలో సింగరేణి ఆస్తులను ఎవరు కబ్జా చేసినా సహించేది లేదని వెల్లడించారు. అంతేకాకుండా మళ్ళీ కబ్జాకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని కబ్జాదారులను హెచ్చరించిన విషయం తెలిసిందే.
కోట్ల విలువైన భూమి కోసం ఆరాటం..
కబ్జా జరిగిన సింగరేణి భూమి ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం కోట్ల రూపాయల రేటు పలుకుతుంది. గని స్థలంతో పాటు దానికి ఆనుకొని ఉన్న పాత సివిల్ డిపార్ట్మెంట్ స్థలం కలుపుకొని 5 ఎకరాల వరకు ఉంటుoది. ఇంత విలువైన స్థలం వదులు కోవడానికి కబ్జాదారులకు మనసోప్పడంలేదు. తొలుత యజమాన్యం స్పందించిన తీరుకు కబ్జాదారులు ఒకింత వెనకడుగు వేసినట్లు కనిపించారు. కానీ నాలుగు రోజుల తర్వాత ఆ స్థలం కోసం మళ్లీ ప్రయత్నాలు భారీ స్థాయిలో మొదలుపెట్టారు. ఈసారి ఏకంగా హైదరాబాద్ ను కేంద్రం చేసుకున్నారు. ఎట్టి పరిస్థితిలో సింగరేణి భూమిని దక్కించుకునేందుకు భారీ స్కెచ్ వేశారు.
ప్రజాప్రతినిధి మధ్యవర్తిత్వంలో సింగరేణి భూమిని సొంతం చేసుకోవడానికీ భారీడీల్ కుదుర్చుకున్నట్లుకున్నట్టు విశ్వాసనీయ సమాచారం విజయ క్రాంతికి అందింది. కాగా సదరు పెద్దాయన ఆశీస్సులతో సింగరేణి భూమిని చేజిక్కించుకునేందుకు తెగ తహతహలాడిపోతున్నారు. ఇదిలా ఉండగా సింగరేణి భూముల కబ్జా ఘటన పై స్థానికులు గగ్గోలు పెడుతుండగా, స్థానిక ఎమ్మెల్యే మాత్రం ఓ కమ్యూనిటీ సమూహంతో నేరుగా సింగరేణి సీఎండి బలరామ్ ను కలసి కబ్జా స్థలం కోసం వినతి పత్రం అందించడం చర్చనీయాంశంగా మారింది. స్థానిక ఎమ్మెల్యే ఎవరికి మద్దతిస్తున్నారో తేటతెలమవుతున్నది.